Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రభుత్వ ఏర్పాటే కాదు…రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ మన బాధ్యత

అఖిలేశ్‌ యాదవ్‌ ఉద్ఘాటన
మావు/బలియా: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మాత్రమే కాదని, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని సైతం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఎస్‌పీ, దాని మిత్రపక్షాల అభ్యర్థుల విజయం కోసం అఖిలేశ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. శుక్రవారం మావులో జరిగిన ఎన్నికల ర్యాలీలో అఖిలేశ్‌ ప్రసంగించారు. దేశంలో ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా రాష్ట్రంలో ఇప్పుడు అతి పెద్ద ఎన్నికలు జరుగుతున్నాయని అఖిలేశ్‌ చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెందుతామన్న నిరాశా, నిస్పృహలు బీజేపీ చర్యలు, భాషలో కనిపిస్తోందని విమర్శించారు. ఎస్‌పీ నాయకుడు స్వామి ప్రసాద్‌ మౌర్య, తన మిత్రపక్షం ఎస్‌బీఎస్‌పీ అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌పై ఆ నేతల విమర్శలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఓటమి భయం పట్టుకున్న నాయకుల భాష, ప్రవర్తన మారుతుందా? బీజేపీ నాయకుల ముఖాల్లో ఓటమి భయం మీకు కనిపిస్తోందా? వారు నిరాశలో ఉండటమే కాకుండా..ఎస్‌పీ నాయకులను అవమానించడం ప్రారంభించారు. ఇందుకు ప్రధాన కారణం..ప్రజలు ఇప్పుడు బీజేపీతో లేరని వారికి అర్థమైంది’ అని అఖిలేశ్‌ అన్నారు. మావు ప్రజలు చాలా విజ్ఞత గలవారని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఇప్పటి వరకు ఎప్పుడూ గెలిపించలేదని చెప్పారు. ఆరో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే మీ మద్దతు కోసం ఇక్కడికి వచ్చాను. మీరు ఎస్‌పీ, దాని మిత్రపక్ష ఎస్‌బీఎస్‌పీ అభ్యర్థులను గెలిపిస్తారని నమ్ముతున్నానని ఎస్‌పీ అధినేత అన్నారు. ‘దేశంలోనే ఇది అతిపెద్ద ఎన్నిక. ఈ ఎన్నికలు యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే ఎన్నికలు’ అని అఖిలేశ్‌ అన్నారు. ఓటమి భయంతో బీజేపీ నిత్యం అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రపంచంలో తమదే అతిపెద్ద పార్టీ అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని నిందించారు. ఎన్నికల ప్రచారం చేయడానికి రాష్ట్రానికి చెందిన జాతీయస్థాయి నాయకుడు ఒక్కడు లేడని, అసలు ఆ నాయకుల ప్రసంగాలు విన్నారా? చిన్న నాయకుడు చిన్న అబద్ధాలు ప్రచారం చేస్తే..పెద్ద నాయకులు పెదపెద్ద అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.
అమిత్‌ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు?
యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. మరొకొన్ని రోజుల్లో యూపీలో చివరి దశ పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధికార పార్టీ(బీజేపీ)పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)లో కుటుంబపాలన సాగుతోందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. ఆయన ఎన్‌డీ టీవీతో మాట్లాడుతూ..సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారన్నారు. ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్‌ షా కొడుకు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్‌ పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎవరి కొడుకు? ప్రస్తుతం కర్ణాటక సీఎం ఎవరు?’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img