Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బడా వ్యాపారులకు మోదీ వత్తాసు

రైతులకు చేసిందేమీ లేదు

రాహుల్‌గాంధీ విమర్శ

వయనాడ్‌ (కేరళ): దేశంలోని రైతుల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…రైతాంగానికి చేసిన మేలు ఏమీలేదని, బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం బడా కార్పొరేట్ల రుణాలను మాఫీ చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు మొండిచేయి చూపిందని రాహుల్‌ నిశితంగా విమర్శించారు. తాను ప్రాతినిథ్యం వహించే వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాహుల్‌ ఇక్కడకు చేరుకున్నారు. కొండ ప్రాంతం మనంతవాడిలో వ్యవసాయ సహకార సంఘం కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్‌జెడ్‌) సమస్యపై ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు తన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన రాహుల్‌ తన నియోజకవర్గానికి రావడం ఇదే ప్రథమం. రాహుల్‌ మాట్లాడుతూ… క్రూర మృగాలనుంచి పంటలను రక్షించడానికి రాష్ట్రంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి ఎటువంటి వ్యూహం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక చోట్ల మానవ-జంతు సంఘర్షణల సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం పునాది అని ఆయన అభివర్ణిస్తూ, వ్యవసాయం అభివృద్ధి చెందకుండా విజయవంతంగా అభివృద్ధి చెందిన దేశం ప్రపంచంలోనే లేదని అన్నారు. లెఫ్ట్‌ ప్రభుత్వంలో రైతులు, వ్యవసాయాన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. రైతుల తీవ్ర నిరసనల నేపథ్యంలో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రస్తావిస్తూ…రైతులను, వ్యవసాయాన్ని రక్షించే దృక్పథాన్ని ప్రభుత్వాలు కలిగి ఉండాలన్నారు. పెద్ద వ్యాపారులు, రైతులను భిన్నంగా చూడాలనే ఆలోచనను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ‘పెద్ద వ్యాపారులు రుణాలు తీసుకుంటారు… రుణాలు ఎగవేసిన వారికి రుణాలు మాఫీ చేస్తారు… మరోవైపు రైతులు చిన్న మొత్తాలను రుణాలుగా తీసుకుంటే సర్ఫేసీ చట్టం కింద నోటీసులు జారీచేస్తారు’ అంటు రాహుల్‌ మోదీ సర్కారు దుయ్యబట్టారు. పెద్ద వ్యాపారులకు, రైతుల మధ్య వివక్ష ఎందుకు చూపుతున్నారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలను, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలుకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలో కాంగ్రెస్‌ పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అంతకుముందు మూడు రోజుల పర్యటన నిమిత్తం కేరళ వచ్చిన రాహుల్‌కు ఆ రాష్ట్ర పార్టీ చీఫ్‌ కె సుధాకరన్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరువనంతపురంలోని అధికార సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్‌పై దాడి ఘటనపై రాష్ట్రంలో ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో గాంధీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎకెజి సెంటర్‌పై బాంబు దాడి వెనుక కాంగ్రెస్‌ పాత్ర ఉందని సీపీఎం ఆరోపించింది. రాహుల్‌ గాంధీ ఆదివారం కోజికోడ్‌ నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img