Friday, April 19, 2024
Friday, April 19, 2024

బాధిత రైతులకు రూ.2 లక్షల పరిహారం

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ
చండీగఢ్‌ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌ ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. రైతు సంక్షేమం లక్ష్యంగా అనేక తాయిలాలు ప్రకటిస్తోంది. తాజాగా మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది రిపబ్లిక్‌ దినోత్సవం నాడు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 83 మంది రైతులకు నష్టపరిహారంగా రూ.2 లక్షలు ఇవ్వాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న రెండు ప్రధాన డిమాండ్లతో రైతులు జనవరి 26న రాజధానిలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించిన విషయం విదితమే. వేలాదిమంది రైతులు ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. బారికేడ్లను సైతం తోసుకుంటూ ముందుకు సాగారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ర్యాలీ సందర్భంగా కొన్ని ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు తన ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తోందని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పునరుద్ఘాటించారు. ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొని దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 83 మంది రైతులకు రెండు లక్షల రూపాయల వంతున పరిహారం ఇవ్వాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. వినాశకర సాగుచట్టాలు రద్దుచేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గతేడాది నవంబరు నుంచి అన్నదాతలు దిల్లీలోకి ప్రవేశించే మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img