Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బాసర ట్రిపుల్‌ ఐటీలో… విద్యార్థుల ఆందోళన

ముథోల్‌: బాసర ఆర్జీయూకేటీలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి అనేకమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విద్యార్థులు భోజనశాల నిర్వాహకుల లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు నూతన నిర్వాహకులను నియమించి నాణ్యతగా భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణకు ఇటీవల విన్నవించారు. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి భరోసా ఇచ్చారు. గడువు ముగిసి ఐదురోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ ఎంపీ సోయం బాపురావు వస్తుండగా లోకేశ్వరం మండలంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా ఆర్జీయూకేటీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంత్రి సబితా ఇంటి ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. దీంతో శ్రీనగర్‌ కాలనీలోని మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే బాసర విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సబితా ఇంటి ముట్టడికి ప్రయత్నించిన పేరెంట్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు మంత్రి ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు. తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, పిల్లల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినట్లు వెల్లడిరచారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. మంత్రి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img