Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బీజేపీలో చేరిన ములాయం కోడలు అపర్ణ

లక్నో : సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ బుధవారం బీజేపీలో చేరారు. ఉత్తర ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, రాష్ట్ర మంత్రి స్వతంత్ర దేవ్‌ సింగ్‌ల సమక్షంలో అపర్ణ కాషాయ కండువా కప్పుకున్నారు. ములాయం రెండవ భార్య కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ను వివాహం చేసుకున్న అపర్ణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ఆయన విధానాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ తన కుటుంబాన్ని కూడా ఐక్యంగా ఉంచలేకపోతున్నారని మౌర్య ఎద్దేవా చేశారు. అపర్ణను పార్టీలోకి స్వాగతిస్తూ, ములాయం సింగ్‌ కోడలు అయినప్పటికీ ఆమె ప్రధాని మోదీ విధానాలకు మద్దతు తెలుపుతుందని మౌర్య చెప్పారు. పార్టీలో ఆమె రాక బీజేపీ స్థాయిని పెంచుతుందని స్వతంత్ర దేవ్‌ అన్నారు. అపర్ణ మాట్లాడుతూ తాను ఎప్పుడూ మోదీని చూసి ముగ్ధురాలిని అయ్యే దానిని, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అపర్ణ బీజేపీలో చేరడం సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ఓబీసీ యాదవులపై ప్రభావం చూపుతుందా లేదా అన్నది చూడాల్సి ఉండగా, అఖిలేష్‌కు మాత్రం కొంత ఇబ్బందికరమే. కీలకమైన ఎన్నికలకు ముందు అఖిలేష్‌ పార్టీకి మద్దతును పెంచుకోవడానికి కృషి చేస్తున్న తరుణంలో ఈ పరిణామం సమాజ్‌వాది పార్టీలో చీలికకు అవకాశంగా కనిపిస్తోంది. బీజేపీ అపర్ణను లక్నో కన్నాట్‌ నుంచి పోటీకి దింపాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తరపున పోటీ చేసిన అపర్ణ యాదవ్‌ బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయింది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. ఆమె తండ్రి అరవింద్‌ సింగ్‌ బిష్త్‌ జర్నలిస్టు. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషనర్‌, తల్లి అంబి బిష్త్‌ లక్నో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి. అంతకుముందు, అపర్ణ సమాజ్‌వాది పార్టీ వైఖరికి భిన్నంగా జాతీయ పౌర నమోదుకు, 370 అధికరణ రద్దుకు తన మద్దతును తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img