Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌దే బాధ్యత : రౌత్‌

పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే అందుకు కాంగ్రెస్‌దే బాధ్యతన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అభిప్రాయాలను శివసేన నేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం సమర్ధించారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ), గోవా ఫార్వర్డు పార్టీ(జీఎఫ్‌పీ)లతో కలిసి కూటమి ఏర్పాటు చేద్దామని తాము కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపాదించామని, దీనికి ఆ పార్టీ స్పందించలేదని సంజయ్‌రౌత్‌ చెప్పారు. ఫిబ్రవరి 14న జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం 11మందితో శివసేన తొలిజాబితాను ప్రకటించిన అనంతరం సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడారు. గోవాలో శివసేన, ఎన్‌సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. గోవా ఎన్నికల్లో బీజేపీని ఓడిరచటంలో కాంగ్రెస్‌ విఫలమైతే అందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పి.చిదంబరం బాధ్యత తీసుకోవాలని, ఆయన రాజీనామా చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అభిషేక్‌ బెనర్జీ గురువారం అన్నారు. ఎన్నికల ముందు పొత్తు కోసం తాము చిదంబరంతో చర్చించామని, అందుకు ఆయన సుముఖత వ్యక్తంచేయలేదని వివరించారు. ‘అభిషేక్‌ బెనర్జీ వ్యాఖ్యలతో నేను ఏకీభివస్తున్నాను. కాంగ్రెస్‌తో చర్చల కోసం మేము కూడా ప్రయత్నించాం. కాంగ్రెస్‌ నేతలు దినేశ్‌ గుండూరావు, దిగంబర్‌ కామత్‌, గిరీశ్‌ చోదంకర్‌లతో మేము సమావేశమయ్యాం. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, జీఎఫ్‌పీ, శివసేన కలిసి ముందుగానే కూటమి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించాం’ అని రౌత్‌ గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడమే చిదంబరం బాధ్యతని, అందువల్ల కాంగ్రెస్‌ ఓటమికి ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం లేదని రౌత్‌ అన్నారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు గల గోవాలో 30 సీట్లు కాంగ్రెస్‌ పోటీ చేయాలని, మిగిలిన పది సీట్లను భాగస్వామ్యపక్షాలుగా తాము పంచుకుంటామని కూడా చెప్పామన్నారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ స్పందించలేదని రౌత్‌ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికైనా కాంగ్రెస్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. ‘మా పార్టీకి మంచి గౌరవం ఉంది. గోవా ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతున్నాం’ అని రాజ్యసభ సభ్యుడు రౌత్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img