Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బెంగాల్‌ అసెంబ్లీలో బాహాబాహీ

కొట్టుకున్న బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేలు
ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. రాంపూర్‌హాట్‌, బీర్భమ్‌ హింసాత్మక ఘటనలపై చర్చ జరపాలని, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేయాలని ప్రతిపక్షనేత సువేందు అధికారి డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు ఒకరినొకరు నెట్టుకున్నారు…కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. తోపులాటలో తృణమూల్‌ ఎమ్మెల్యే అసిత్‌ మజుందార్‌ ముక్కు పగిలింది. బీజేపీ ఎమ్మెల్యే మనోజ్‌ తిగ్గ బట్టలు చిరిగిపోయాయి. మరోవైపు శాసనసభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో శాసనసభ ప్రతిపక్షనేత సువేందు అధికారి సహా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ బిమన్‌ బంధోపాధ్యాయ్‌ సస్పెండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మేల్యేలు దీపక్‌ బుర్మన్‌, శంకర్‌ ఘోష్‌, మనోజ్‌ తిగ్గా, నరహరి మహతో సహా అధికారిపై ఈ ఏడాది జరిగే తదుపరి అసెంబ్లీ సెషన్స్‌ నుంచి వారిని బహిష్కరించారు. స్పీకర్‌ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సువేందు సహా బీజేపీ సభ్యులందరూ సభ భయట నిరసనకు దిగారు. బీజేపీ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో స్పీకర్‌ చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. సభలో జరిగిన రభసపై బీజేపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో వీడియో షేర్‌ చేశారు. ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవ్య, ప్రతినిధి షెహజాద్‌ జై హింద్‌తో పాటు అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభలో అడ్డుకున్నారు. రెండు వర్గాల ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మార్షల్స్‌ ప్రయత్నించారు. కాగా బీజేపీ నేత సువేందు తనను కొట్టినట్లు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్‌ మజుందార్‌ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై స్టేట్‌మెంట్‌ ఇవ్వమంటే, సివిల్‌ డ్రెస్సులో వచ్చిన పోలీసులు తమపై దాడికి దిగారని సువేందు ఆరోపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు భద్రత లేదని, 10 మంది ఎమ్మెల్యేలను కొట్టారని ఆయన ఆరోపించారు. కాగా బీజేపీ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని, తమ ఎమ్మెల్యేలను వాళ్లే కొట్టారని తృణమూల్‌ నేత, మంత్రి ఫిర్హద్‌ హకీమ్‌ తెలిపారు. కాగా పశ్చిమబెంగాల్‌లోని బీర్భమ్‌ జిల్లాలో పది ఇళ్లకు నిప్పంటించిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు బాద్‌షేక్‌ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న ఈ ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు బీర్భమ్‌ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను సీబీఐ స్వీకరించింది. ఈ దారుణ ఘటనపై అనేక కేసులు నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img