Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఘన నివాళి

న్యూదిల్లీ: దేశం గర్వించదగ్గ స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు బుధవారం లోక్‌సభ ఘనంగా నివాళులర్పించింది. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని స్పీకర్‌ ఓం బిర్లా కీర్తించారు. సభ ప్రారంభమైన వెంటనే బిర్లా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకార్థం మార్చి 23ని అమరవీరుల దినోత్సవం (షహీద్‌ దివస్‌)గా పాటిస్తున్నామని, వారి త్యాగాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ సభకు హాజరైన సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
దేశప్రజలకు ఎల్లవేళలా స్ఫూర్తి : ప్రధాని మోదీ
భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్థంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా నివాళులర్పించారు. ‘భారతమాత అమర కుమారులు వీర్‌ భగత్‌ సింగ్‌, సుఖ్‌దేవ్‌ మరియు రాజ్‌గురులకు అమరవీరుల దినోత్సవం నాడు నివాళులు. మాతృభూమి కోసం మరణించాలనే వారి మక్కువ దేశప్రజలకు ఎల్లవేళలా స్ఫూర్తినిస్తుంది’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.
ఖట్కర్‌ కలాన్‌లో మాన్‌…
భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌ కలాన్‌లో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌… భగత్‌సింగ్‌కు నివాళులర్పించారు. ఖట్కర్‌ కలాన్‌లోని భగత్‌ సింగ్‌ మ్యూజియం, స్మారక చిహ్నం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘మేము ఈరోజు అవినీతి నిరోధక చర్యను ప్రారంభిస్తున్నాం’ అని ప్రకటించారు. తమ ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప అమరవీరుల కలలను సాకారం చేయడం ద్వారా పంజాబ్‌ను అవినీతి రహిత మరియు సంపన్న పంజాబ్‌గా మారుద్దాం అని మాన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేనివాలా వద్ద నివాళులర్పించారు, అక్కడ ముగ్గురు అమరవీరులను లాహోర్‌ సెంట్రల్‌ జైలులో ఉరితీసిన తరువాత దహనం చేశారు. అమరవీరుల దినోత్సవమైన మార్చి 23న పంజాబ్‌ ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ముగ్గురు యువ స్వాతంత్య్ర సమరయోధులను లాహోర్‌లోని లాహోర్‌ సెంట్రల్‌ జైలులో మార్చి 23, 1931న ఉరితీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img