Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

భయం గుప్పెట్లో యూపీ ప్రజలు

నియంతృత్వ బీజేపీని ఎదుర్కొనేది కాంగ్రెస్సే
ఎస్పీ, బీఎస్పీ కాషాయ పార్టీతో రాజీపడ్డాయి
ఛత్తీస్‌ఘఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘెల్‌

న్యూదిల్లీ : నియంతల పార్టీ బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్‌ ప్రజలు భయంతో జీవిస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సీనియర్‌ పరిశీలకుడిగా నియమితులైన బాఘెల్‌ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాలక బీజేపీ ఎన్నికల వాగ్ధానాలేవీ నెరవేర్చలేదని, మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని, మరో రెండు ప్రతిపక్ష పార్టీలు ఎస్పీ (సమాజ్‌వాదీ పార్టీ), బీఎస్పీ (బహుజన్‌ సమాజ్‌ పార్టీ) రెండూ బీజేపీకి అనుకూలంగా రాజీ పడినట్లు కనిపిస్తుస్తోందని చెప్పుకొచ్చారు. ఈ సారి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత ఎన్నికల కంటే చాలా భిన్నంగా ఉంటాయని, రాజకీయ పండితులను ఆశ్చర్యపరిచే రీతిలో ఫలితాలు ఉంటాయని తెలిపారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయ ఎత్తుగడ అని, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రైతులు విశ్వాసం కోల్పోయారని బాఘెల్‌ అన్నారు. ప్రజాస్వామ్య మూలాలు బీజేపీకి అర్థంకానంత లోతుగా ఉన్నాయని ఈ రైతుల ఆందోళన రుజువు చేసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత 32 ఏళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో లేదన్నది వాస్తవమని, అయితే పార్టీ ఇన్‌చార్జి గా ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత గత రెండేళ్లలో చాలా మార్పులు వచ్చాయని బాఘెల్‌ తెలిపారు. ఆమె క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించడానికి చాలా కష్టపడుతున్నారని, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకత్వంలో మార్పులపై పార్టీలో వ్యతిరేకతను తిరస్కరించిన బాఘెల్‌, తమ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుందని, కాషాయ పార్టీలా నియంతృత్వంపై ఆధారపడదన్నారు. ‘రాహుల్‌జీ నాయకత్వానికి సంబంధించినంతవరకు, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడు ఆయనే. అదే సమయంలో అతను ధైర్యశాలి, నిస్వార్థపరుడు, కరోనా నుంచి లాక్‌డౌన్‌ వరకు చైనా నుంచి రైతుల ఆందోళన వరకు ఆయన రాజకీయ అంచనాలు, లెక్కలు సరైనవని నిరూపించబడ్డాయి’ అని తెలిపారు. ‘మా పార్టీ శ్రేణులు ఇప్పుడు అన్ని స్థాయిల్లోనూ గళం విప్పుతున్నారు. కష్టపడి పనిచేస్తున్నారు. మేము ఇటీవలి కాలంలో మూడు ప్రధాన ర్యాలీలను నిర్వహించాము, ఒకటి ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో, రెండవది సీఎం సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లో, మూడవది బుందేల్‌ఖండ్‌లో జరిగాయి. ర్యాలీలకు వచ్చిన జనం, ఉత్సాహాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు’ అని బాఘెల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img