Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మతాచారంపై ప్రత్యేక నిర్ణయం తీసుకోలేం

మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌వాల్సే పాటిల్‌
అఖిలపక్ష భేటీకి బీజేపీ గైర్హాజరు

ముంబై: హనుమాన్‌ చాలీసా పఠనం వివాద నేపథ్యంలో మహారాష్ట్రలో ఒకప్పుడు మిత్రపక్షాలుగా కొనసాగిన శివసేన, బీజేపీ మధ్య దూరం భారీగా పెరిగింది. అధికారపక్షంలో శివసేన, ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పటికీ.. ఒక దానిపై మరొకటి ఎంతో కొంత సానుకూలతగా వ్యవహరించేవి. కానీ, హనుమాన్‌ చాలీసా వివాదంతో ఈ రెండు పార్టీలు తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు సవాల్‌ చేయడంతో వారిపై యాంటీ నేషనల్‌ అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. హనుమాన్‌ చాలీసా, లౌడ్‌స్పీకర్లు వంటి అంశాల ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ల సారథ్యంలో జరిగిన ఈ సమావేశం జరగ్గా, ఈ భేటీకి బీజేపీ హాజరు కాలేదు. ఈ సమావేశం అనంతరం హనుమానల్‌ చాలీసా ఘటనపై అటు అధికార పక్షం శివసేన, ఇటు ప్రతిపక్షం బీజేపీ వేర్వేరుగా విలేకరుల సమావేశాలను నిర్వహించి మాట్లాడాయి. కొన్ని రాజకీయ పార్టీలు లౌడ్‌స్పీకర్లపై డెడ్‌లైన్‌ ప్రకటించాయని, దీనిపై తాము ఒక సమావేశానికి పిలుపు ఇచ్చినప్పటికీ బీజేపీ రాలేదని హోంమంత్రి పాటిల్‌ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొనసాగడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నదని వివరించారు. లౌడ్‌స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వినియోగిస్తారని తెలిపారు. లౌడ్‌స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తొలగించదని పేర్కొన్నారు. ముస్లింల అజాన్‌ ప్రార్థనపై గొడవలు జరిగాయని, ఒక వేళ ఈ అజాన్‌ ప్రార్థనలపై చర్యలు తీసుకుంటే ఇతర మత వేడుకలపై ఉండే పరిణామాల పరిస్థితి ఏమిటీ? హిందువులకు గణపతి, నవరాత్రి ఉత్సవాలు, ఆర్తీ, భజనల వంటి వేడుకలు ఉంటాయని తెలిపారు. కాబట్టి, ఒక మత ఆచారంపై ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకోలేమని వివరించారు.
కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అఖిల పక్ష సమావేశం కోసం బీజేపీకి ఆహ్వానం అందిందని తెలిపారు. కానీ, తాము ఆ సమావేశానికి హాజరుకాలేదని వివరించారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ తీరును చూసిన తర్వాతే అక్కడకు వెళ్లాలని భావించలేదని తెలిపారు. ఒకరు హిట్లర్‌ పాత్రను పోషిస్తున్నప్పుడు వారితో సమావేశంలో చర్చలు జరపడానికి బదులు పోరాటం చేయడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, తదనుగుణంగా పనిచేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించినట్లు పాటిల్‌ తెలిపారు. 2005లో సుప్రీంకోర్టు లౌడ్‌ స్పీకర్ల వినియోగం (నిబంధనలు)పై నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇతర కోర్టులు కూడా ఈ విషయంలో నిర్ణయాలు వెలువరించాయి. దీని ప్రకారం, 2015-17 మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై సమయాలు, డెసిబెల్‌ పరిమితులతో సహా మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ఆధారంగా రాష్ట్రంలో లౌడ్‌ స్పీకర్లను వినియోగిస్తున్నారన్నారని చెప్పారు. ‘లౌడ్‌ స్పీకర్లను అమర్చడం లేదా తొలగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకూడదనే నిబంధన లేదు. లౌడ్‌స్పీకర్లు అమర్చిన వారు, వినియోగించే వారు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది’ అని పాటిల్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img