Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

‘మధ్యాహ్నం’ వంటకు వేతనం పెంపు ఏదీ..?

సిబ్బందికి నెలకు రూ.2 వేల లోపే చెల్లింపు
దాదాపు 65 శాతం వంటవారికి తక్కువ జీతం
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు పట్టని వైనం

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కార్‌ పథకాలు ప్రచారర్భాటమేనని స్పష్టమవుతోంది. బడి పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు ‘ప్రధాన మంత్రి పోషణ్‌’ పేరుతో కొనసాగుతున్న ‘మధ్యాహ్న భోజనం’ పథకం అస్తవ్యస్తంగా మారింది. పాలకులు పథకం ఉద్దేశం నెరవేరేలా చర్యలు చేపట్టడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించే ఉద్దేశంతో చేపట్టిన పాఠశాలల్లో ‘మధ్యాహ్న భోజనం’ పథకం అష్టకష్టాలు ఎదుర్కొంటోంది. ‘మధ్యాహ్నం భోజనం’ను వండివార్చే వారికి జీతం పెంపు అంశం పాలకులకు పట్టడం లేదు. భారతదేశంలోని 24.95 లక్షల మంది వంటవారు, సహాయకులు అంటే దాదాపు 65 శాతం మంది మధ్యాహ్న భోజన పథకం కింద పని చేస్తున్నారు. దీనిని ఇప్పుడు ప్రధాన మంత్రి పోషణ్‌ అని పిలుస్తున్నారు. అయితే అధికారిక రికార్డుల ప్రకారం ఈ పథకం సిబ్బంది నెలకు రూ.2 వేల కంటే తక్కువ వేతనం పొందుతున్నారు. అనేక సంవత్సరాలుగా అనేక పార్లమెంటరీ కమిటీలు భోజన పథకం సిబ్బందికి వేతనం పెంచాలని సిఫార్సు చేసినప్పటికీ, ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వీరికి చెల్లింపులు రూ.1,000కే పరిమితమయ్యింది. మధ్యాహ్న భోజన పథకంలో సమష్టిగా మరో 29.72 శాతం శ్రామిక శక్తిని కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో నెలవారీ చెల్లింపులు సంవత్సరాలుగా స్వల్పంగా పెరిగాయి. కానీ ఆ వేతనం రూ.2 వేలకు దిగువనే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ సీసీహెచ్‌లుగా పిలవబడే వంటవారు, సహాయకులకు నెలవారీ వేతనాన్ని వరుసగా రూ.21 వేలు, రూ.12 వేలు, రూ.9 వేలు చొప్పున చెల్లిస్తూ ముందంజలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, విద్యా మంత్రిత్వ శాఖ 2018, 2020 సంవత్సరాలలో వేతనాలను రూ.2 వేలకు పెంచాలని సూచించింది. అయితే రాష్ట్రాలు చెల్లింపులో అగ్రగామిగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. అవసరాలు, డిమాండ్ల ఆధారంగా రాష్ట్రాలు గౌరవ వేతనాన్ని పెంచాలని పేర్కొంది. కాగా సీసీహెచ్‌లకు సంబంధించి గౌరవ వేతనాన్ని పెంచాలని రాష్ట్రాలు డిమాండ్‌ చేసినప్పుడు కూడా విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఇదేవిధంగా స్పందించింది. ‘సామాజిక సేవలను అందించడానికి ముందుకు వచ్చిన వంటవారు, సహాయకులు గౌరవ కార్యకర్తలుగా వర్గీకరించబడ్డారు. వారు కార్మికులుగా పరిగణించబడరు. తత్ఫలితంగా, వారికి కనీస వేతనాలపై చట్టాలు వర్తించవు’ అని అధికారి చెప్పారు. ప్రధాన మంత్రి పోషణ్‌ కింద వంటవారు, సహాయకులకు చెల్లింపుల కోసం నిధులను కేంద్రం 60:40 నిష్పత్తిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలతో విభజించింది. మార్చి నెలలో రాజ్యసభ స్టాండిరగ్‌ కమిటీ తన నివేదికలో వివిధ రాష్ట్రాలు వంటవారు, సహాయకులకు చెల్లించే గౌరవ వేతనంలో అసమానతను గుర్తించింది. వివిధ రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని కొనసాగించేలా వంట చేసేవారికి చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని నిర్ణయించడానికి శాఖ ఏకరీతి వ్యవస్థను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. 2020లో మరో రాజ్యసభ స్టాండిరగ్‌ కమిటీ కూడా ఇదే సిఫార్సు చేసింది. సంవత్సరాలుగా సీసీహెచ్‌లకు చెల్లింపుల్లో జరిగిన అక్రమాలు కూడా బయటపడ్డాయి. 2021లో చాలా వరకు ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 3.93 లక్షల సీసీహెచ్‌లకు చెల్లింపులు జరగలేదు. గత నెలలో విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ప్రధాన మంత్రి పోషణ్‌ విభాగం నుండి రాష్ట్ర అధికారులకు ఒక సందేశం వచ్చింది. నవంబర్‌ 30న ఉత్తర ప్రదేశ్‌ మిడ్‌ డే మీల్‌ అథారిటీ తన ప్రతిస్పందనలో, కొత్త పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ కింద సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ(ఎస్‌ఎన్‌ఏ) ఖాతాల ద్వారా డబ్బు చెల్లించవలసి ఉంటుందని ఒక రైడర్‌తో మే నెలలో కేంద్రం వాటాను పొందినట్లు తెలిపింది. కాగా యూపీ ప్రభుత్వం ఎస్‌బీఐతో ఒక ఎస్‌ఎన్‌ఏ ఖాతాను తెరిచింది. ఖాతాను యాక్టివేట్‌ చేయడానికి మూడు నుండి నాలుగు నెలల సమయం పడుతుందని సెప్టెంబర్‌ 21న పేర్కొంది. అయితే తరువాత, రాష్ట్రం దానిని ప్రస్తుత సంవత్సరానికి పొందిన కొత్త విధానం నుండి మినహాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. తదనంతరం, రాష్ట్ర ఆర్థిక శాఖ స్థాయిలో ఇది మరింత ఆలస్యమైందని యూపీ ఎండీఎం అథారిటీ తెలిపింది. ఏదిఏమైనా, దేశంలో ప్రధాన మంత్రి పోషణ్‌ పథకం నిర్వహణ అంతంతమాత్రంగానే సాగుతోందని, దీని విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడినట్లు స్పష్టమవుతోంది. సామాజిక సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన ‘మధ్యాహ్న భోజనం’ పథకం సిబ్బంది చాలీచాలని గౌరవ వేతనంతో పని చేయలేని పరిస్థితి నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img