Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మహారాష్ట్రలో 10మంది మంత్రులు

20 మంది ఎమ్మెల్యేలకు కరోనా
ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌

పూనె : మహారాష్ట్రను కరోనా వైరస్‌ అల్లాడిస్తోంది. 10మందికి పైగా మంత్రులు, 20 మంది శాసనసభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ శనివారం చెప్పారు. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్క రోజే 8,067 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే కేసుల సంఖ్య 50శాతం పెరిగాయి. ‘కరోనా విజృంభణతో అసెంబ్లీ సమావేశాలను మధ్యలోనే ఆపేశాం. ఇప్పటి వరకు 10మందికి పైగా మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. నూతన సంవత్సర వేడుకలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలలో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రాణాంతక ఒమిక్రాన్‌ వేగవంతంగా వ్యాప్తి చెందుతుండటాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల అప్రమత్తత అవసరం. ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి మేరకు కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రకు సంబంధించి ముంబై, పూనెలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి’ అని అజిత్‌ పవార్‌ వివరించారు. కోరెగావ్‌ భీమా యుద్ధం 204వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పూనె జిల్లా పెర్నె గ్రామంలో గల స్మారకస్థూపాన్ని సందర్శించిన అనంతరం అజిత్‌ పవార్‌ విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో కోవిడ్‌`19 కేసుల పెరుగుదల కొనసాగితే కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుందని పవార్‌ చెప్పారు. ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలేకు ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తన భర్త సదానంద సూలేకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లు సుప్రియ బుధవారం ప్రకటించారు. రాష్ట్రమంత్రులతో పాటు వర్ష గైక్వాడ్‌, యశోమతి థాకూర్‌, కేసీ పడ్వీలకు ఇటీవల కరోనా సోకింది. రాధాకృష్ణ విఖె పాటిల్‌, సాగర్‌ మెఘే సహా అనేకమంది శాసనసభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇంతకుముందు రాష్ట్రమంత్రులు జితేంద్ర అవహద్‌, ధనుంజయ ముండే, దిలీప్‌ వాల్సే పాటిల్‌ను సైతం కరోనా వదల్లేదు. డిసెంబరులోని చివరి 12 రోజుల్లో మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రయత్నిస్తోంది. 50 మందికి మించి ఎక్కడా గుమికూడవద్దని గురువారం నుంచి ఆంక్షలు విధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img