Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మహిళలను కించపర్చే ప్రశ్నలా..?

సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రంపై సోనియా తీవ్ర అభ్యంతరం
ఆ ప్రశ్నను వెంటనే ఉపసంహరించుకోవాలి..
ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

న్యూదిల్లీ : సీబీఎస్‌ఈ పదవ తరగతి ప్రశ్నాపత్రంలో ‘మహిళలను కించపరిచేలా’, ‘అర్థం లేని’ ప్రశ్నలు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం తీవ్రంగా ఖండిరచారు. ఇది విద్య, పరీక్షల ప్రమాణాలను ‘అత్యంత పేలవం’గా ప్రతిబింబిస్తోందని అన్నారు. శనివారం నిర్వహించిన 10వ తరగతి సీబీఎస్‌ఈ పరీక్ష ఇంగ్లీష్‌ ప్రశ్నాపత్రంలో ‘మహిళలను తక్కువ చేసి చూడటం’, ‘భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ వంటి వాక్యాలతో కూడిన పేరాలో ప్రశ్నలు ఉన్నాయి. కాగా మహిళలను విద్వేషించే విధంగా ఉన్న పేరాను సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రంలో ఇవ్వడాన్ని సోనియా గాంధీ తీవ్రంగా ఖండిరచారు. దీనిపై మోదీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని లోక్‌సభలో జీరో అవర్‌లో లేవనెత్తిన సోనియా.. ఈ అభ్యంతరకరమైన ప్రశ్నను వెంటనే ఉపసంహరించుకోవడంతోపాటు దీనికి గల కారణాలపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.‘అనేక రకాల సామాజిక, కుటుంబ సమస్యలకు స్త్రీలు స్వాతంత్య్రం పొందడమే ప్రధాన కారణం’, ‘భార్యలు తమ భర్తలకు విధేయత చూపడం మానేస్తే, పిల్లలు, సేవకులు క్రమశిక్షణా రాహిత్యానికి ప్రధాన కారణం’ వంటి దారుణమైన వ్యాక్యాలు ఈ పేరాలో ఉన్నాయంటూ సీబీఎస్‌ఈ పదవ తరగతి ప్రశ్నాపత్రం నుంచి ఆ సారాంశాన్ని ఆమె చదివి వినిపించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మాట్లాడుతూ మొత్తం ఆ పేరా అటువంటి ఖండిరచదగిన ఆలోచనలతో నిండి ఉందని, తరువాత వచ్చిన ప్రశ్నలు సమానంగా ‘అర్థం లేనివి’ అని అన్నారు. గాంధీ లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ కాంగ్రెస్‌, డీఎంకే, ఐయూఎంఎల్‌, ఎన్‌సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ‘విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల ఆందోళనలకు నేను నా స్వరాన్ని జోడిస్తాను. సీబీఎస్‌ఈ నిర్వహించే ముఖ్యమైన పరీక్షలో ఇటువంటి కఠోరమైన స్త్రీ ద్వేషపూరిత అంశాలపై నేను తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తుతాను’ అని ఆమె అన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) తక్షణమే ప్రశ్నలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని సోనియా డిమాండ్‌ చేశారు. ‘ఇది ఎప్పటికీ పునరావృతం కాకుండా’ ఉండేలా ఈ ‘తీవ్రమైన లోపం’ గురించి సమగ్ర సమీక్ష నిర్వహించాలని కోరారు. ‘పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల లింగ సున్నితత్వ ప్రమాణాలపై విద్యా మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని కూడా నేను కోరుతున్నాను’ అని రాయ్‌బరేలీ లోక్‌సభ సభ్యురాలు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img