Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మోదీ సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనం

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపుపై విపక్షాలు
న్యూదిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగించాలన్న మోదీ సర్కారు నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది ముమ్మాటికీ నిరంకుశత్వం, తర్కానికి నిలవదని విమర్శించాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు, నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సవరణ) బిల్లు 2021, దిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌(సవరణ) బిల్లు 2021ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుల ఆమోదం సరికాదని, వీటికి సంబంధించిన ఆర్డినెన్స్‌లను సైతం రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌తివారీ డిమాండ్‌ చేశారు. ఈ బిల్లులు తీసుకురావడం మోదీ సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం ఇప్పటి వరకు రెండేళ్లు మాత్రమే. సాధారణంగా కొన్ని ప్రభుత్వాలు కొంతమంది పదవీకాలం ఒకటి, రెండుసార్లు పొడిగిస్తూ ఉంటాయి. కానీ మోదీ సర్కారు ఆ పదవులకు ఐదేళ్ల కాలపరిమితి విధిస్తూ ఏకంగా చట్టం చేయడానికి సాహసించింది. అధికార దుర్వినియోగానికే కేంద్రప్రభుత్వం ఈ బిల్లులు తీసుకొచ్చిందని తివారీ ఆరోపించారు. ‘ఏ రాజ్యాంగమైనా పటిష్టంగా ఉండాలన్నా లేక బలహీనపర్చాలన్నా సంస్థలు వాటికి మద్దతిస్తుంటాయి. దురదృష్టవశాత్తు గడచిన ఏడున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోంది’ అని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఆ దిశగా తీసుకొచ్చిన మరో మైలురాయి వంటివే ఆ బిల్లులని తివారీ అన్నారు. సీబీఐ, ఈడీ వంటి స్వయంప్రతిపత్తి గలిగిన సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికే మోదీ ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతోందని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సంస్థలపై ప్రభుత్వ జోక్యాన్ని కట్టడిచేయడానికే ఇలాంటి తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్‌ సైతం ఇవే అభిప్రాయాలు వ్యక్తంచేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ఆర్డినెన్స్‌లు ఎందుకు తీసుకొచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అత్యవసరంగా ఈ ఆర్డినెన్స్‌లు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? వాటిని తీసుకురావడానికి అసాధారణ పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా? దీనికి సరైన వివరణే కనిపించడం లేదు. పార్లమెంటు చట్టబద్ధ అధికారాన్ని మోదీ ప్రభుత్వం చాలా తక్కువ చేస్తోందని ప్రేమచంద్రన్‌ విమర్శించారు. కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img