Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

యూపీ కాంగ్రెస్‌ ‘సారథి’ ప్రియాంక

న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ సారథిగా ప్రియాంక గాంధీ వాద్రా వ్యవహరిస్తారని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. తమకు సంబంధించినంత వరకు ఆమె కెప్టెన్‌ అని, తమకు దిశానిర్దేశం చేస్తున్నదీ ప్రియాంకనే అని పీటీఐతో చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకను ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ సారథిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆమె ఆ రాష్ట్ర ఓటర్ల ముందుకు ఏ తీరున రావాలనుకున్నది ప్రియాం కనే నిర్ణయించుకుంటారని తెలిపారు. ప్రియాంకకు జనదారణ ఉందని, ఆమెను ‘గ్రేట్‌ ఫేస్‌’ అంటూ ఖుర్షీద్‌ అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలరన్నారు. కాంగ్రెస్‌ తన పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎన్నికల్లో పోటీ చేయలన్న దృఢ నిశ్చయంతో ఉందని ఖుర్షీద్‌ తెలిపారు. పొత్తులు/కూటముల కోసం ఎదురు చూడబోదని, ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సన్నద్ధ మవుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రియాంకేనా అన్న ప్రశ్నకు ఆ మేరకు ఆమె సంకేతమిచ్చే వరకు సమాధానం చెప్పలేనని ఖుర్షీద్‌ బదులిచ్చారు. ప్రియాంక అద్భుతమని, ఆమె ఫొటో పక్కనే (యూపీ సీఎం) యోగి చిత్రాన్ని పెట్టి చూస్తే సమాధానం మీకే లభిస్తుందని ఖుర్షీద్‌ చమత్కరించారు. పార్టీకి సారథిగా వ్యవహరించే విషయంలో ప్రియాంక త్వరలోనే ఓ నిర్ణ యానికి వస్తారని ఆకాంక్షించారు. తమకు దిశానిర్దేశం ఇచ్చేది ప్రియాంకనే అని చెప్పారు. యూపీ కాంగ్రెస్‌ బలంగా లేకున్నాగానీ 2022 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన ప్రత్యర్థిగా నిలవగలదన్న దీమాను ఆయన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ప్రియాంక దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు పొత్తులపై చర్చలు జరగలేదని ఓ ప్రశ్నకు బదు లిచ్చారు. ఒంటరి పోరునకే కాంగ్రెస్‌ సమాయత్త మవుతోందని, అవసరం అనుకుంటే సందర్భాన్ని బట్టి పొత్తులపై అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. గతసారి కూటమిలో రాణించలేకపోయాం. కలిసి పోటీ చేసిన క్రమంలో తప్పు ఎక్కడ జరిగిందో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ గ్రహించాయి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా దాని లోటుపాట్లు అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పొత్తులు పెట్టుకునే ముందు ఉత్తరప్రదేశ్‌లో ఈ పంథా పనిచేస్తుందా? గతసారి ఎక్కడ లోపం ఉంది? ఇంకా ఏం చేయాలి? అని ప్రశ్నించుకోవాలని, వాటి సమాధానాల బట్టి నిర్ణయం తీసుకోవాలని ఖుర్షీద్‌ అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలోని 403 స్థానాలకుగాను 47ను సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా కాంగ్రెస్‌ కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. బీఎస్పీకి 19, బీజేపీకి 312 స్థానాలు దక్కాయి. కాగా, ఈసారి పెద్ద పార్టీలతో కాకుండా చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img