Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం లేదు

మంత్రివర్గ విస్తరణపై విభేదాలు లేవు..
అధిష్టానం నిర్ణయమే మిగిలి ఉంది..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మకేన్‌

జైపూర్‌ : మంత్రివర్గ విస్తరణ ప్రణాళికపై రాజస్థాన్‌లోని పార్టీ నాయకులలో ఎటువంటి విభేదాలు లేవని, అధిష్టానం నిర్ణయమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మకేన్‌ ఆదివారం తెలిపారు. ఇక్కడ పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసు బేరర్ల సమావేశం తర్వాత మకేన్‌ మాట్లాడుతూ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ విషయంలో వారు కేంద్ర నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారని అన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తేదీని మకేన్‌ వెల్లడిరచలేదు. కానీ ఆయన మళ్లీ జులై 28న రాష్ట్ర రాజధానిలో ఉంటాడు. ‘పార్టీ నాయకులలో ఎలాంటి విభేదాలు లేవని నేను చెప్పగలను. వారంతా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన తుది నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేశారు’ అని ఆయన విలేకరులకు తెలిపారు. జైపూర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కె.సి.వేణుగోపాల్‌తో కలిసి మకేన్‌ చేరుకున్నారు. ద్రవ్యోల్బణం, పెగాసస్‌ వంటి సమస్యలపై చర్చించినట్లు ఆయన చెప్పారు. ‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారితో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం డబ్బు, వనరులను ఖర్చు చేయడానికి బదులుగా, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థపై గూఢచార్యం కోసం వనరులను దుర్వినియోగం చేసింది. ఇది తీవ్రంగా ఖండిరచదగిన విషయం’ అని అన్నారు. మకేన్‌ మాట్లాడుతూ పార్టీ జిల్లా, బ్లాక్‌ అధ్యక్షుల నియామకంపై ఎమ్మెల్యేలతో చర్చించేందుకు జులై 28న జైపూర్‌ వస్తానని మకేన్‌ తెలిపారు. కాగా వేణుగోపాల్‌, మకేన్‌ శనివారం రాత్రి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో కలిసి ఆయన నివాసంలో రాజకీయ నియామకాలు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చించారు. పంజాబ్‌ తరువాత, పార్టీ హైకమాండ్‌ తన దృష్టిని రాజస్థాన్‌ వైపునకు మార్చింది. ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ నేతృత్వంలోని శిబిరం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చిన తరువాత కేబినెట్‌ విస్తరణ, రాజకీయ నియామకాలకు డిమాండు పెరిగింది. గత సంవత్సరం గెహ్లాట్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు చేశాడు. అయితే తాను లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ చర్యలు చేపడుతుందని మూడు రోజుల క్రితం సచిన్‌ పైలట్‌ సూచనప్రాయంగా చెప్పారు. తాను లేవనెత్తిన సమస్యలపై పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నానని, అధిష్టానం త్వరలో చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే గెహ్లాట్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన తర్వాత గత ఏడాది జులైలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ), ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి పైలట్‌ను తొలగించారు. నెల రోజుల రాజకీయ సంక్షోభం తర్వాత పార్టీ అధిష్టానం పైలట్‌ లేవనెత్తిన సమస్యలను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలాఉండగా గత నెలలో పైలట్‌ శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ, రాజకీయ నియామకాల నేపథ్యంలో గత నెలలో పైలట్‌కు ఇచ్చిన హామీలను పార్టీ నెరవేర్చాలని కోరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రి మండలిలో 21 మంది సభ్యులు ఉన్నారు. తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. కాగా రాజస్థాన్‌లో గరిష్ఠంగా 30 మంది మంత్రులు ఉండవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img