Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాయ్‌గఢ్‌లో కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి అంత్యక్రియలు

రాయ్‌గఢ్‌ : రెండు రోజుల క్రితం మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, అతని భార్య, కుమారుడి మృతదేహాలను సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని వారి స్వస్థలమైన రాయ్‌గఢ్‌కు తరలించారు. శనివారం మణిపూర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో అసోం రైఫిల్స్‌కు చెందిన ఖుగా బెటాలియన్‌ కమాండిరగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ త్రిపాఠి, భార్య అనుజ (36), కుమారుడు అబీర్‌ (5), పారామిలటరీ దళానికి చెందిన నలుగురు జవాన్లు మృతిచెందిన సంగతి విదితమే. అమరవీరుడు కల్నల్‌, అతని భార్య, కొడుకు భౌతిక దేహాలతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారత వైమానిక దళ ప్రత్యేక విమానం రాయ్‌గఢ్‌లోని ఎయిర్‌స్ట్రిప్‌లో దిగింది. కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి సోదరుడు, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అనయ్‌ త్రిపాఠి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఉమేష్‌ పటేల్‌, రాయ్‌గఢ్‌ ఎంపీ గోమతి సాయి, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు వెంటరాగా అక్కడి నుంచి కల్నల్‌ త్రిపాఠి ఇంటి వద్దకు పూలతో అలంకరించిన ట్రక్కులో మృతదేహాలను తరలించారు. అనంతరం రామలీలా మైదానంలో భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. సాయంత్రం సర్క్యూట్‌ హౌస్‌ సమీపంలోని శ్మశానవాటికలో పూర్తి సైనిక, ప్రభుత్వ గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అమరవీరు కల్నల్‌ త్రిపాఠీకి నివాళిగా రాయగఢ్‌ పట్టణంలో బంద్‌ పాటించారు. ఆదివారం సాయంత్రం రాయ్‌గఢ్‌కు చేరుకున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన కల్నల్‌ ఆర్‌ఎస్‌ ఠాకూర్‌, మరో నలుగురు అధికారులు మరియు 45 మంది సిబ్బంది కల్నల్‌ త్రిపాఠి ఇంటికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కల్నల్‌ త్రిపాఠి తండ్రి సుభాష్‌ త్రిపాఠి స్థానిక హిందీ దినపత్రిక ‘దైనిక్‌ బయార్‌’ సంపాదకుడు. విప్లవ్‌ త్రిపాఠి 14 ఏళ్ల వయసులో 1994లో కిషోరి మోహన్‌ త్రిపాఠి మరణించారు. ఆర్మీ యూనిఫాం ధరించడానికి ఆయనకు తాత ప్రేరణనిచ్చారని త్రిపాఠి మామ రాజేష్‌ పట్నాయక్‌ తెలిపారు. 2001లో రాణిఖేత్‌లోని కుమావోన్‌ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా నియమితులైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img