Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రాల అధిక స్వయంప్రతిపత్తి సాధనకు కట్టుబడి ఉన్నాం

చెన్నై : రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి సాధించడానికి తమిళనాడు కట్టుబడి ఉందని, అదే సమయంలో కేంద్రంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తుందని తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ సోమవారం తెలిపారు. మే నెలలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయిన నేపథ్యంలో రాష్ట్ర 16వ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తూ, డీఎంకే ప్రభుత్వ విధానాన్ని వివరించారు. నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ ఎస్తేర్‌ డుఫ్లే సహా ప్రముఖ నిపుణులతో ఒక ఆర్థిక సలహా మండలిని ముఖ్యమంత్రి నియమించారని అన్నారు. కొవిడ్‌`19 థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. రాష్ట్రానికి టీకాలను కేటాయించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. కర్ణాటకకు చెందిన మేకెదాటు డ్యామ్‌ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక సలహా మండలిలో డుఫ్లేతోపాటు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ సలహాదారు అరవింద సుబ్రమణియన్‌, అభివృద్ధి ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.నారాయణ్‌లు ఉన్నారని గవర్నర్‌ వివరించారు. ఇది ఆర్థిక వృద్ధి మందగమనాన్ని తిప్పికొట్టడం, వేగవంతమైన వృద్ధి పథాన్ని తెలియజేస్తుందని అన్నారు. మండలి సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఆర్థిక పునర్జీవనానికి చర్యలు తీసుకుంటుందని, సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ప్రయోజనాలు చేరువయ్యేలా చూస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఆందోళన కలిగిస్తుందని, దానిని మెరుగుపరిచేందుకు, అప్పుల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. తమిళనాడు ఆర్థిక స్థితిపై జులైలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు. ‘రాష్ట్రాలకు అధిక స్వయం ప్రతిపత్తిని సాధించే అంతిమ లక్ష్యానికి, రాజ్యాంగ మార్గం ద్వారా కేంద్ర స్థాయిలో నిజమైన సమాఖ్యను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక బలమైన ఏకీకరణకు బలమైన రాష్ట్రాలు అవసరం. ఈ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం గట్టిగా నిలబడుతుంది. అటువంటి హక్కుల ఉల్లంఘన ఏదైనా జరిగితే వాటిని రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకిస్తుంది’ అని గవర్నర్‌ తన ప్రసంగంలో తెలిపారు. అదే సమయంలో కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలను రాష్ట్రం కొనసాగిస్తుందని అన్నారు. విద్య ద్వారా పురోగతి, సామాజిక సంస్కరణలు, రిజర్వేషన్ల ద్వారా అందరికీ అవకాశం, ఆర్థిక సమానత, లింగ సమానత, సామాజిక న్యాయాన్ని గుర్తించడం, ద్రావిడ ఉద్యమం స్ఫూర్తితో తమిళనాడు ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. తమిళనాడులో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, వాటి కార్యాలయాలలో తమిళనాడు ప్రజల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరిందని అన్నారు. తమిళులు, ప్రత్యేకించి తమిళ మీడియం, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి ప్రభుత్వ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు గవర్నర్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img