Friday, April 19, 2024
Friday, April 19, 2024

రైతుల హత్యకు నిరసనగా పంజాబ్‌లో కాంగ్రెస్‌ భారీ నిరసన

నిందితుడిని అరెస్టు చేయకపోతే ఆమరణ దీక్ష
పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ సిద్ధూ హెచ్చరిక
చండీగఢ్‌ :
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నలుగురు రైతులను కాన్వాయ్‌తో ఢీకొట్టి చంపిన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడు ఆశిష్‌మిశ్రాను తక్షణమే అరెస్టు చేయాలన్న డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. లఖింపూర్‌ ఖేరీ సమస్యపై విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. మోదీ, యోగీ సర్కార్లపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను అత్యంత కిరాతకంగా కారుతో ఢీకొట్టి చంపడాన్ని సభ్యసమాజం తీవ్రంగా ఖండిస్తోంది. కాగా, రైతులను కిరాతకంగా, ఉద్దేశపూర్వకంగా చంపిన కేంద్రమంత్రి కొడుకుని తక్షణమే అరెస్టు చేయాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ డిమాండ్‌ చేశారు. ఇందుకు యూపీ సర్కారుకు గడువు విధించారు. శుక్రవారం నాటికి ఆశిష్‌మిశ్రాను అరెస్టు చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని సిద్ధూ హెచ్చరించారు. ఆదివారం నలుగురు రైతులను తన కాన్వాయ్‌తో ఢీకొట్టి చంపిన కేసులో ఆశిష్‌మిశ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. రైతుల హత్యను నిరసిస్తూ సిద్ధూ నాయకత్వంలో గురువారం పంజాబ్‌ నుంచి లఖింపూర్‌ ఖేరీకి భారీ ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనకు ముందు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సహా పార్టీ నాయకులు మొహాలీకి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. నిరసన ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ కొద్దిసేపు పాల్గొన్నారు. ప్రదర్శన ప్రారంభానికి ముందు సిద్ధూ మాట్లాడుతూ లఖింపూర్‌ ఘటనపై యూపీ ప్రభుత్వాన్ని దునుమాడారు. పంజాబ్‌ కాంగ్రెస్‌, పార్టీ ఎమ్మెల్యేలు రైతులకు అండగా ఉంటారని స్పష్టంచేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ కేంద్రమంత్రి తనయుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని యూపీ అధికారులను ప్రశ్నించారు. కేంద్రమంత్రి, ఆయన కుమారుడు చట్టం, రాజ్యాంగానికి అతీతులా? అని నిలదీశారు. తమ పోరాటం రైతుల కోసమని స్పష్టంచేశారు. కేంద్రమంత్రి కొడుకును యూపీ పోలీసులు అరెస్టు చేయకపోతే తాను ఆమరణదీక్షకు దిగుతానని, ఇది తన హామీ అని చెప్పారు. శుక్రవారం లోపుగానే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీలను ప్రజాస్వామ్య పరిరక్షకులుగా సిద్ధూ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img