Friday, April 19, 2024
Friday, April 19, 2024

రోడ్ల అభివృద్ధిలో కాంగ్రెస్‌ పాత్ర లేదా?

ఎంపీ విష్ణు ప్రసాద్‌ ప్రశ్న
న్యూదిల్లీ: దేశంలో రోడ్ల అనుసంధానం అభివృద్ధి పనులకు యూపీఏ ప్రభుత్వమే శంకుస్థాపన చేసిందని కాంగ్రెస్‌ ఎంపీ ఎంకే విష్ణు ప్రసాద్‌ సోమవారం లోక్‌సభలో చెప్పారు. నాడు యూపీఏ చేపట్టిన పనుల కారణంగానే ప్రపంచంలో భారతదేశం రోడ్‌ నెట్‌వర్క్‌లో రెండవ అతిపెద్ద దేశంగా మారిందని ఆయన తెలిపారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ.2 లక్షల కోట్ల కేటాయింపులు పెరగడానికి ప్రభుత్వం వద్ద గల కారణాలేమిటని విష్ణు ప్రసాద్‌ కోరారు. అమెరికా తర్వాత భారత్‌లోనే 63.5 లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం జరిగినట్లు అధికార పార్టీ గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోందని, అయితే, ఈ విస్తరణ రాత్రికి రాత్రి జరిగింది కాదని ఆయన పేర్కొన్నారు. ఇది జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితమేనన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు 68శాతం నిధుల కేటాయింపు పెంచడంపై ప్రశ్నిస్తూ రోడ్ల నాణ్యత అత్యంత దారుణంగా ఉందన్నారు. రోడ్ల భద్రతకు కేవలం రూ.356 కోట్ల మాత్రమే కేటాయించారని విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్‌ గావో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో రోడ్లు బాగా ఉన్నందున ఫెరారి, పోర్చ్‌, మెర్సిడెజ్‌, లంబోర్గిని వంటి ప్రముఖ కార్ల కంపెనీలు కారు ర్యాలీల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. మోదీ హయాంలోనే రోడ్లు బాగుపడ్డాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లోనా కాలాపాని వరకు రోడ్‌ నెట్‌వర్క్‌ విస్తరించిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్‌పై సేకరించిన లెవీ సెస్‌ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డుప్రమాదాల నియంత్రణ కోసం కఠినచట్టాలు తీసుకురావాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img