Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లఖింపూర్‌ హింస కేసు విచారణకు కేంద్రమంత్రి తనయుడి డుమ్మా

నేడు హాజరు కావాలని పోలీసుల తాజా నోటీసు
నా కుమారుడు అమాయకుడంటున్న అజయ్‌మిశ్రా

లఖింపూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నలుగురు రైతులను దారుణంగా తన కాన్వాయ్‌తో ఢీకొట్టి చంపించిన కేసులో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడు ఆశిష్‌మిశ్రా శుక్రవారంనాటి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆశిష్‌మిశ్రాకు యూపీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. శనివారం ఉదయం 11 గంటల కల్లా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆదివారం నాటి లఖింపూర్‌ ఖేరీ హింసలో నలుగురు రైతులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం విదితమే. శనివారం దర్యాప్తు అధికారుల ముందు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని తాజా నోటీసులో పోలీసులు హెచ్చరించారు. అశిష్‌మిశ్రా ఇంటిలో అందుబాటులో లేకపోవడంతో నోటీసును కేంద్రమంత్రి మిశ్రా ఇంటి గోడకు అంటించారు. విచారణ నిమిత్తం ఆశిష్‌ మిశ్రా కోసం ఎదురుచూశామని, ఆయన రాకపోవడంతో తాజాగా నోటీసులు జారీ చేసినట్లు డీఐజీ ఉపేంద్ర అగర్వాల్‌ చెప్పారు. లఖింపూర్‌ ఖేరీ దర్యాప్తు బృందానికి అగర్వాల్‌ నాయకత్వం వహిస్తున్నారు. వాస్తవంగా ఆశిష్‌ మిశ్రా నేపాల్‌ పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే పోలీసు విచారణకు హాజరుకాలేదని తెలుస్తోంది. కాగా, నిందితుడు ఆశిష్‌ మిశ్రా నేపాల్‌ పారిపోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, నేపాల్‌లోనే నిందితుడిని అరెస్టు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నిన్న డిమాండ్‌ చేశారు. నిందితుడు ఆశిష్‌మిశ్రాను పోలీసులు ఇంకా కనుక్కోలేకపోయారని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆయన మారుతూ తప్పించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయని సంయుక్త కిసాన్‌ మోర్చా ఓ ప్రకటనలో పేర్కొన్నది. నిందితుడి కోసం యూపీ పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆశిష్‌మిశ్రాను ఇంకా అరెస్టు చేయకపోవడాన్ని మోర్చా తీవ్రంగా స్పందించింది. దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఈ కేసులో గురువారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు…శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ అజయ్‌మిశ్రా ఇంటి బయట నోటీసు అందించారు.
ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా స్పందిస్తూ ‘చట్టంపై మాకు పూర్తి నమమ్మకం ఉంది. నా కొడుకు అమాయకుడు. ఆశిష్‌ కోసం గురువారం నోటీసు ఇచ్చారు. అయితే, అతనికి ఆరోగ్యం బాగాలేదు. శనివారం పోలీసుల ముందు హాజరవుతాడు. తాను అమాయకుడినన్న ఆధారాలు సమర్పిస్తాడు’ అని చెప్పారు. లఖింపూర్‌ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడటం, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడంపై స్పందిస్తూ ప్రతిపక్షం ఏదైనా డిమాండ్‌ చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇది బీజేపీ ప్రభుత్వం. పక్షపాత ధోరణికి అవకాశమే లేదు. నేరస్తులెవరైనా శిక్షించి తీరుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img