Friday, April 19, 2024
Friday, April 19, 2024

లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో భారీ పేలుడు

ఒకరి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
విద్రోహశక్తుల పనేనన్న పంజాబ్‌ సీఎం

లుథియానా : పంజాబ్‌ రాష్ట్రం లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. రెండో అంతస్తులో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఉదయం 11 గంటలకు రెండో అంతస్తులోని కోర్టు నంబరు 14 సమీపంలో శౌచాలయం వద్ద పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు తీవ్రతకు శిథిలాలు.. ఎగురుకుంటూ వచ్చి కింద ఉన్న వాహనాలపై పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు కోర్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. పేలుడుకు కారణాలేమిటని ఆరా తీశారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో గాలించారు. కోర్టు వద్ద భద్రతను పెంచారు.పేలుడు జరిగిన ప్రాంతాన్ని మూసివేశామని, ఫోరెన్సిక్‌ బృందాలు నమూనాలు సేకరిస్తున్నట్లు లుథియానా పోలీస్‌ కమిషనర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ భుల్లార్‌ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తొలుత పేలుడు ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత ఒక్కరే మృతిచెందినట్లు పేర్కొన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ పేలుడును ఘటనను తీవ్రంగా ఖండిరచారు. చండీగఢ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను లుథియానా కు వెళ్తున్నాను. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదు’ అని తెలిపారు. కోర్టు ఆవరణలో పేలుడు వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ట్వీట్‌చేశారు. మరోవైపు.. పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కొందరు చూస్తున్నారని, రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజలు అటువంటి యత్నాలను సఫలం కానివ్వరని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పేలుడుపై శిరోమణి అకాలీదళ్‌ అధినేత సుక్బీర్‌సింగ్‌ బాదల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img