Friday, April 19, 2024
Friday, April 19, 2024

వచ్చేది కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వమే

మీడియా అంటే బీజేపీకి భయం : రౌత్‌
పూనె : పాలక బీజేపీపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ శనివారం విమర్శలు గుప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని రౌత్‌ చెప్పారు. ఏకపార్టీ ప్రభుత్వ శకానికి వచ్చే ఎన్నికలు ముగింపు పలుకుతాయని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. పూనె ప్రెస్‌క్లబ్‌లో రౌత్‌ విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్‌ రాజకీయాల గురించి వివరించారు. కాంగ్రెస్‌ లేకుండా కేంద్రంలో మరో ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ మూలాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇతర పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలేనని చెప్పారు. నాలుగు దశాబ్దాల పాటు బీజేపీనే అధికారంలో ఉంటుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన ప్రకటనపై ప్రశ్నించగా భారత రాజకీయాల్లో బీజేపీ ఉంటుందని, అయితే ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని రైత్‌ చెప్పారు. ‘ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ చెప్పుకుంటోంది. అలాంటి పార్టీలు కూడా ఎన్నికల్లో ఓటమి చెందితే ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు. ఉదాహరణకు మహారాష్ట్రలో 105 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రతిపక్షంలో కూర్చున్నది కదా అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం తాము దాద్రా, నాగర్‌ హవేలీ, గోవా ఎన్నికలపై దృష్టి పెట్టామని, యూపీ ఎన్నికల గురించి మాట్లాడటానికి ఇంకా సమయం ఉందని శివసేన ఎంపీ చెప్పారు. యూపీలో తాము చిన్న భాగస్వామి మాత్రమేనని, అయినా పోటీ చేస్తామని తెలిపారు. అంతకుముందు జేఎస్‌ కరందికర్‌ స్మారకోపన్యాసం చేస్తూ దేశంలో మీడియా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని రౌత్‌ అన్నారు. గడచిన రెండేళ్లుగా పార్లమెంటు సెంట్రల్‌ హాలులోకి మీడియా ప్రతినిధులకు అనుమతి లేదన్నారు. పాలక పార్టీ దీనికి కరోనా వైరస్‌ను కారణంగా చెబుతోందన్నారు. దీనివెనుక గల అసలైన కారణం ఏమిటంటే..మంత్రులు విలేకరులతో మాట్లాడితే అనేక అంశాలు బయటికివస్తాయని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని రౌత్‌ తెలిపారు. జర్నలిస్టులకు దూరంగా ఉండాల్సిందిగా మోదీ సర్కారు మంత్రులను ఆదేశించిందన్నారు. మంత్రులపై నిత్యం నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి మాదిరిగా ఎమర్జెన్సీ సమయంలోనూ మీడియాను అడ్డుకోలేదని రౌత్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img