Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వచ్చే 25 ఏళ్లు ‘అమృత కాలం’

75వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ

న్యూదిల్లీ : రాబోయే 25 ఏళ్లలో భారత్‌ బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతుందని, అది ‘అమృత కాలం’ అవుతుందని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగించారు. కొత్త ఆకాంక్షలు, కలలు సాకారమవుతాయని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించాయి. మరో పాతికేళ్లలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతుందని, అందుకు అనుగుణంగా, మౌలికవసతులను, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు రూ.100 లక్షలకోట్లతో ‘గతిశక్తి’ ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోని అత్యాధునిక మౌలికవసతుల్లో ప్రతీది భారత్‌లో ఉంటుందని ఆకాంక్షించారు. ఉగ్రవాదం, విస్తరణవాదం నేపథ్య సవాళ్లను ఎంతో సాహసోపేతంగా ఎదుర్కొంటోందని అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు భారత్‌ వెనక్కు తగ్గదని, ఆ దిశగా ముందుకు సాగేందుకు రాజకీయ సంకల్పం ఉందని మోదీ అన్నారు. మెరుపుదాడులు, వైమానిక దాడులు జరిపి శత్రువులకు భారత్‌ దృఢమైన సంకేతాలు ఇచ్చిందని, ఇది మారుతున్న భారత్‌కు సంకేతమని, క్లిష్టమైన నిర్ణయాలను అయినా తీసుకోగలదని, వాటి అమలుకూ సంకోచించదని మోదీ వక్కాణించారు. దేశ భద్రత కోసం సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసేందుకు చేయగలిగినదంతా చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి ఎనిమిదవసారి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 90 నిమిషాలు సాగింది. కవిత్వంతో తన ప్రసంగాన్ని ముగించారు. ‘ఇదే సరైన సమయం.. భారత్‌కు అమూల్యమైన సమయం’ అని, వచ్చే 25 ఏళ్లు ‘అమృత కాలం’ అని మోదీ చెప్పారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు దేశం ఆత్రుతగా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రయాస చేస్తున్నారని అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రతి సవాల్‌ను అనూహ్యమైన వేగంతో సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. కోవిడ్‌తో పోరులో భారతీయుల సహనశక్తి చూపించారని, వాక్సిన్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేదంటే ఆ ఘటన భారతీయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలదని అన్నారు. పట్టణాలు, పల్లెలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తుడిచేయాలని, అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని, దళితులు, ఎస్టీ, వెనుకబడిన కులాలు, ఇతర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు అందేలా చూస్తున్నామని మోదీ అన్నారు. రూ.100 లక్షలకోట్లతో ‘ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌’ను ప్రారంభిస్తామని ప్రధాని చెప్పారు. సమగ్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేసేలా పరిపూర్ణమైన మౌలికవసతుల సృష్టికి ఈ ప్రణాళిక దోహదపడుతుంద న్నారు. అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడేందుకు, భవిష్యత్‌ మౌలికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ నినాదాలకు సబ్‌ కా ప్రయాస్‌ కూడా జోడిద్దామంటూ పిలుపునిచ్చారు. నవభారత నిర్మాణ లక్ష్యాన్ని సమష్టిగా కృషిచేద్దామన్నారు. భారత స్వతంత్ర అమృత మహోత్సవంలో మొదటి 75 వారాల్లో 75 వందేభారత్‌ రైళ్ల సేవలను ప్రవేశపెడతామని, ఈ రైళ్లు దేశ నలుమూలలను అనుసంధానం చేస్తాయన్నారు. వందశాతం పల్లెలకు రోడ్లు, 100శాతం బ్యాంకు ఖాతాలు, 100 శాతం మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, 100 శాతం ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు అందించడమే కాకుండా బాలికల కోసం దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు ప్రారంభిస్తామని మోదీ అన్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతలందరికీ నివాళులర్పించారు. తొలి ప్రధాని నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌లకు దేశం రుణపడి ఉంటుందని మోదీ అన్నారు. మేకిన్‌ ఇండి యా కింద జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘ఎనర్జీ’లో స్వీయసమృద్ధి సాధించేందుకు 2047 వరకు లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడిరచారు. ‘ఛోటా కిసాన్‌ బనే దేశ్‌కి షాన్‌’ (చిరు రైతు దేశ ప్రతిష్ట) కావాలని నినదించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం`కిసాన్‌) కింద పది కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో రూ.1.5లక్షలకోట్లు బదిలీ అయినట్లు వెల్లడిరచారు. 2024 నాటికి గ్రామాల్లో అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు కల్పించాలన్నది జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యమని మోదీ చెప్పారు. రెండేళ్లుగా 4.5కోట్లకుపైగా ఇళ్లకు నల్లా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, విద్యుత్‌ వంటి సౌకర్యాలు గ్రామాలకు అందుతున్నాయని చెప్పారు. ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్వర్క్‌ ద్వారా గ్రామాలకు ఇంటర్నెట్‌ చేరుతోందని తెలిపారు. డిజిటల్‌ పారిశ్రామికవేత్తలు ఊర్లలో తయారవుతున్నారని మోదీ అన్నారు. ఈశాన్య భారతం, హిమాలయ ప్రాంతాలు, జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img