Friday, April 19, 2024
Friday, April 19, 2024

వర్సిటీలపై కేరళ గవర్నరు రాద్ధాంతం

ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ తీరుపై వామపక్షాల ఆగ్రహం
తిరువనంతపురం : రాష్ట్రంలో యూనివర్సిటీల పనితీరుపై కేరళ గవర్నరు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గవర్నరు ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ యూనివర్సిటీలపై పెత్తనం చెలాయించాలని కోరుకుంటున్నారు. గవర్నరును యూనివర్సిటీలకు చాన్సలర్‌గా చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ చట్టం తీసుకొచ్చిందని, దీని ద్వారా ఆ పదవి నుంచి చాన్సలర్‌ను బలవంతంగా తొలగించడం సాధ్యం కాదని లెఫ్ట్‌ఫ్రంట్‌ నేత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కన్నన్‌ రాజేంద్రన్‌ చెప్పారు. అదేసమయంలో అవసరమైతే చాన్సలర్‌ను పక్కన పెట్టే అధికారం కూడా ఆ చట్టానికి ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చర్యకు ఎప్పుడూ పాల్పడలేదని ఆయన వివరించారు. రాష్ట్రంలో యూనివర్సిటీల చాన్సలర్‌ పదవిని తమ గుప్పెట్లోకి తీసుకోవాలన్న ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, చాన్సలర్‌ పదవిలో గవర్నరు ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ కొనసాగవచ్చని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వయంగా నిన్న ప్రకటించారు. కన్నన్‌ రాజేంద్రన్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ గవర్నరు పదవి ఆవశ్యకతను సూటిగా ప్రశ్నించారు. గవర్నరు అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని, రచ్చ చేయడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గవర్నరు పదవే అనవసరమని తమ పార్టీ బలంగా విశ్వసిస్తోందని, ఆ పదవి చేపట్టిన వ్యక్తుల నుంచి ఇలాంటి చర్యలు ఎంతమాత్రం మంచిది కాదని రాజేంద్రన్‌ హితవు పలికారు. యూనివర్సిటీల వ్యవహారాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. గవర్నరు, ప్రభుత్వం మధ్య సమాచారం లేదా సంభాషణను రహస్యంగా ఉంచాలన్న నిబంధనలను ఆరిఫ్‌ ఖాన్‌ ఉల్లంఘిస్తున్నారని సీపీఐ నేత విమర్శించారు. గవర్నరు యదేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. చాన్సలర్‌గా తన అధికారాలను తక్కువ చేసేందుకు లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, యూనివర్సిటీల కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం పెరుగుతోందని, ఇది తనను తీవ్రంగా బాధించిందని ఆరోపిస్తూ గవర్నరు డిసెంబరు 8వ తేదీన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కన్నూరు యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ప్రొఫెసర్‌ గోపినాథ్‌ రవీంద్రన్‌ను మరోసారి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంపై గవర్నరు తీవ్ర ఆగ్రహం చెందారు. యూనివర్సిటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నియామకానికి సంబంధించి చాన్సలర్‌కు గల అధికారాలు తొలగిస్తూ యూనివర్సిటీ చట్టానికి అసెంబ్లీ సవరణ తీసుకొచ్చినట్లు ఆయన ఆరోపించారు. ట్రిబ్యునల్‌ నియామకానికి సంబంధించి చాన్సలర్‌ హైకోర్టును సైతం సంప్రదించకుండా నిబంధనల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీకి వైస్‌చాన్సరల్‌గా ఒకేఒక పేరును సిఫార్సు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. యూనివర్సిటీల వ్యవహారాన్ని రాజకీయం చేయాలని గవర్నరు ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ విమర్శించారు. నియామకాలపై సంతకాల విషయంలో గవర్నరుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని స్పష్టంచేశారు. శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ పదవికి సంబంధించి ఒకే ఒక పేరును గవర్నరు ఆమోదంతో సెర్చ్‌ కమిటీ సూచించిందని బాలకృష్ణన్‌ వివరించారు. గవర్నరు ఆదేశాల మేరకే సెర్చ్‌ కమిటీ పేర్లు సూచిస్తుందని తెలిపారు. ఈ విషయంపై గవర్నరు తాజాగా తన వైఖరి మార్చుకున్నారని, ఇది ఓ మిస్టరీ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img