Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విమానయాన సంస్థలపై
సమగ్ర సమీక్ష చేయండి

ప్రయాణికుల భద్రతపై రాజీపడొద్దు
కేంద్ర మంత్రి సింధియాకి సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం లేఖ

న్యూదిల్లీ : విమానయాన సంస్థల ‘దయనీయ భద్రతా పరిస్థితులు’ పై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎంపీ వినయ్‌ విశ్వం శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా నమోదవుతున్న అనేక సంఘటనల నేపథ్యంలో విమానయాన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి ఆయన లేఖ రాశారు. గత 18 రోజులుగా ఎనిమిది సాంకేతిక లోపాలను చవిచూసిన స్పైస్‌జెట్‌కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. స్పైస్‌జెట్‌ మాదిరిగానే ఇండిగో, విస్తారా కూడా మంగళవారం సాంకేతిక లోపానికి గురయ్యాయి. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా దేశవ్యాప్తంగా విమానయాన సంస్థలపై సమగ్ర సమీక్ష జరిగేలా చూడాలని, వినయ్‌ విశ్వం కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం దేశంలో విమానయాన సంస్థలు పనిచేస్తున్న దయనీయ, భయంకర భద్రతా పరిస్థితులకు సంబంధించి ఈ లేఖ రాశాను’ అని వినయ్‌ విశ్వం వివరించారు. గత కొన్ని నెలలుగా అనేక భద్రతా సంఘటనలు, అత్యవసర ల్యాండిరగ్‌లు జరిగాయని వామపక్ష నాయకుడు పేర్కొన్నారు. వివిధ విమానయాన సంస్థల్లో సుమారు 21 మిడ్‌-ఎయిర్‌ సేఫ్టీ (గాలిలో ఉండగా భద్రతా లోపాలు) సంఘటనలు జరిగాయి. వాటిలో 10 గత నెలలోనే జరిగాయి’ అని వివరించారు. ‘దీంతో పాటు అనేక విమానయాన సంస్థలు ఎయిర్‌ కండిషనింగ్‌ పనిచేయకపోవడం వంటి లోపాలను ఎదుర్కొన్నాయి. ఇది ప్రయాణీకులను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు దారితీసింది. ఇటువంటి విచారకరమైన పరిస్థితి క్షమించరానిది. విమాన ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే భయపడుతున్న ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది’ అని తెలిపారు. ఈ సమస్యలు ‘జనాభాలో 4 శాతం మంది మాత్రమే విమాన ప్రయాణాన్ని ఉపయోగిస్తున్నారనే విషయాన్ని, విమాన టికెట్ల తలసరి వినియోగం విషయంలో కొన్ని పేద ఆఫ్రికా దేశాలతో పాటు భారతదేశ స్థానం ఉందన్న విషయాన్ని పూర్తిగా గుర్తుచేస్తుంది’ అని ఆయన విమర్శించారు. ‘పెరుగుతున్న విమాన ఇంధన ధరలతో విమానయాన సంస్థలపై భారం పెరుగుతోంది. ఖర్చు తగ్గించే చర్యగా భద్రతా విధానాల రాజీ గురించి మన మనస్సులో మరింత సందేహాన్ని కలిగిస్తుంది’ అని సీపీఐ నేత పేర్కొన్నారు. అయితే, ప్రయాణీకుల భద్రతకు సంబంధించి దీనిని సాకుగా పరిగణించలేమని ఆయన నొక్కి చెప్పారు. ‘పైన పేర్కొన్న విషయాల దృష్ట్యా, దేశవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల సమగ్ర సమీక్ష, మదింపు ఉండేలా చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రయాణీకుల భద్రత, శ్రేయస్సు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు’ అని ఎంపీ వినయ్‌ విశ్వం స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img