Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘వైర్‌’కు ఫ్రీ మీడియా పయనీర్‌ అవార్డు

న్యూదిల్లీ : ‘ఫ్రీ మీడియా పయనీర్‌’ అవార్డు 2021వ సంవత్సరానికి ది వైర్‌ సంస్థను వరించినట్టు ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐపీఐ) బుధవారం తెలిపింది. భారత్‌లోని డిజిటల్‌ న్యూస్‌ విప్లవంలో మొదటిస్థానం సంపాదించడంతో పాటు బెదిరింపులకు తలొగ్గకుండా స్వతంత్ర సంస్థగా నాణ్యతతో కూడిన వార్తలను ది వైర్‌ అందించిందని ఐపీఐ ప్రశంసించింది. ఈ ఏడాదికి ఐపీఐ -ఐఎంఎస్‌ ఫ్రీ మీడియా పయనీర్‌ అవార్డుకు వైర్‌ మీడియాను ఎంపిక చేయడం గర్వంగా అనిపించిందని ఐపీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బార్బరా ట్రియోన్సీ తెలిపారు. స్వతంత్ర జర్నలిజమ్‌ పట్ల ‘వైర్‌’ నిబద్ధత ఐపీఐ సభ్యులకు స్పూర్తినిచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొనే సమయంలో మీడియాకు అండగా నిలబడతామని బార్బరా వక్కాణించారు. ఆస్ట్రియాలోని వియన్నాలో సెప్టెంబర్‌ 16న జరగనున్న ఐపీఐ వార్షిక సమావేశంలో ఈ అవార్డును బహుకరిస్తామని తెలిపారు. ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని ది వైర్‌ వ్యవస్థాపకుడు, ఎడిటర్‌ సిద్ధార్ద్‌ వరదరాజన్‌ అన్నారు. దేశంలోని డిజిటల్‌ మాధ్యమాలను ప్రభావితం చేసే రాజకీయ, కార్పొరేట్‌ ఒత్తిళ్లు లేకుండా, ప్రజలకు నాణ్యతతో కూడిన వాస్తవాలను అందించడమనే లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేశామని అన్నారు. అందుకు ప్రతిఫలంగా పరువు నష్టం కేసులు, క్రిమినల్‌ కేసులు, ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొన్నామని, అయితే ప్రపంచవ్యాప్తంగా లభించిన ఈ గుర్తింపుతో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img