Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శబరిమలకు భారీగా భక్తులు-చేతులెత్తేసిన ట్రావెన్కోర్‌ బోర్డు ! తాజా ఆంక్షలు

ఈ ఏడాది శబరిమల యాత్రలో భక్తుల ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుకు లక్షమందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వస్తున్నారు. అయితే ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులైన ట్రావెన్‌ కోర్‌ దేవస్దానం బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా దాదాపు మూడేళ్ల పాటు అయ్యప్ప భక్తులు పూర్తిస్దాయిలో దర్శనం చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది భారీ ఎత్తున భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తున్నారు. దీన్ని ముందే ఊహించి ఏర్పాట్లు చేయడంలో మాత్రం ట్రావెన్‌ కోర్‌ బోర్డు విఫలమైంది. అయ్యప్ప దర్శనం కోసం గత వారం రోజులుగా రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చారు. డిసెంబర్‌ 10న ఈ సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంది. భారీ రద్దీతో పలువురు యాత్రికులు, పోలీసులు కూడా గాయపడ్డారు. భక్తుల రద్దీతో ట్రావెన్‌ కోర్‌ బోర్డు దర్శన సమయాన్ని 19 గంటలకు పొడిగించినా, వర్చువల్‌ క్యూ సిస్టమ్‌ లో బుకింగ్స్‌ను రోజుకు 90 వేలకు పరిమితం చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో సరైన ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు ట్రావెన్‌ కోర్‌ బోర్డుపై వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయానికి వెళ్లే పర్వత మార్గంలో యాత్రికులు భారీ క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది. ఆలయ ముందుభాగం, గర్భగుడిలోకి వెళ్లే ఫ్లైఓవర్‌లో రద్దీ తక్కువగానే ఉంటోంది. అయితే ఆలయం నుంచి కిలోమీటరు దూరం వరకూ మాత్రం యాత్రికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో రద్దీ నియంత్రణ విషయంలో టీడీబీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్ధానం బోర్డు నిన్న తాజాగా సమావేశమై పరిస్దితిని చర్చించింది. రద్దీ నివారణ కోసం మరిన్ని నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది. అయితే అంతా జరిగిపోయాక ఇప్పుడు ఆంక్షలు పెంచాలని టీడీబీ చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా శబరిమలలో మౌలిక సదుపాయాల కల్పనకు స్వదేశీ దర్శన్‌ పథకం కింద కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసినా రూ.20 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. 2005లో బేస్‌ క్యాంపును ట్రాన్సిట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు నీలక్కల్‌ దగ్గర 250 ఎకరాల స్థలాన్ని కేంద్రం కేటాయించింది. దీన్ని కేరళ ప్రభుత్వం వాడుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img