Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సత్యేంద్ర జైన్‌కు ‘పద్మ విభూషణ్‌’ ఇవ్వాలి: కేజ్రీవాల్‌

న్యూదిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయి జూన్‌ 9వ తేదీ వరకూ ఈడీ కస్టడీలోకి తీసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి అండగా నిలిచారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టారని, ఇందులో రాజకీయ ఉద్దేశాలున్నాయని ఇప్పటికే కేజ్రీవాల్‌ ప్రకటించారు. తాజాగా ఆయన సత్యేంద్ర జైన్‌కు ‘పద్మ విభూషణ్‌’ ఇవ్వాలంటూ కితాబిచ్చారు. దేశ రాజధాని దిల్లీకి మొహల్లా క్లినిక్‌లు అందించిన సత్యేంద్ర జైన్‌ ప్రతిష్ఠాత్మక ‘పద్మ విభూషణ్‌’ అవార్డుకు అర్హుడని కేజ్రీవాల్‌ అన్నారు. మొహల్లా క్లినిక్‌ మోడల్‌ తీసుకువచ్చినందుకు యావద్దేశం ఆయనను చూసి గర్వించాలని, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ క్లినిక్‌లను సందర్శించారని తెలిపారు. ఉచితంగా ప్రజలకు చికిత్స అందించే హెల్త్‌ మోడల్‌ను జైన్‌ అందించారని, ఇందుకుగాను ఆయనకు అత్యున్నత పద్మభూషణ్‌ లేదా పద్మవిభూషణ్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌ చెప్పినట్టు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. సీబీఐ కూడా గతంలో తన మంత్రి సత్యేంద్ర జైన్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని, ఇప్పుడు ఈడీ దర్యాప్తు సాగిస్తోందని, మళ్లీ మరోసారి ఆయన క్లీన్‌చిట్‌తో బయటపడతారని కేజ్రీవాల్‌ అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తప్పుడు కేసులు నిలబడవని, జైన్‌ కళంకం లేకుండా బయటపడాతారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img