Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘సల్లి డీల్స్‌’, ‘బుల్లీ బాయి’ యాప్‌ల కేసులో ఆరుగురి అరెస్ట్‌

లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడి
న్యూదిల్లీ : ‘సల్లి డీల్స్‌’, ‘బుల్లి బాయి’ యాప్‌లపై కేసులకు సంబంధించి దిల్లీ, ముంబైలలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో తెలిపింది. అలాగే, సుల్లి డీల్స్‌ కేసులో 2022 మార్చి 4న కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలయింది. రెండు యాప్‌లు ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి అనుమతి లేకుండా వారి చిత్రాలను పోస్ట్‌ చేశాయి. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా సమాధానమిస్తూ, సమాచార సాంకేతిక చట్టం`2000, భారత నేరశిక్షాస్మృతి (ఐపీసీ) 1860 కింద ‘సల్లి డీల్స్‌’, ‘బుల్లీ బాయి’ యాప్‌ల కేసుల విషయంలో దిల్లీ, ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు అనంతరం దిల్లీ పోలీసులు ‘సల్లి డీల్స్‌’ కేసులో నిందితుడైన ఓంకారేశ్వర్‌ ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు ఆయన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ‘బుల్లి బాయి’ ఘటనలో ప్రధాన నిందితుడు నీరజ్‌ బిష్ణోయ్‌ని దిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు వివరించారు. అలాగే కర్ణాటక, ఉత్తరాఖండ్‌, ఒడిశాకు చెందిన మరో నలుగురు నిందితులను కూడా ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైనర్‌ బాలికలకు సంబంధించి అశ్లీలత గురించి ఎలాంటి నివేదిక లేదని, ప్రస్తుతం అరెస్టయిన నిందితులందరూ దిల్లీ, ముంబైలలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు. దేశంలో ముస్లిం మహిళలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి భారత ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ ఐక్యరాజ్య సమితి అధికారులెవరూ అధికారిక ప్రకటన చేసినట్లు ప్రభుత్వానికి తెలియదని మిశ్రా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img