Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సహకార స్ఫూర్తికి ముప్పు

న్యూదిల్లీ : కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో సహకార స్ఫూర్తి, ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత బినయ్‌ విశ్వం ఆందోళన వ్యక్తంచేశారు. ఏకపక్షంగా కేంద్ర సహకార శాఖ ఏర్పాటుపై ఒక ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ సహకార ఉద్యమ చరిత్రను గుర్తుచేశారు. 1904లో భారత సహకార చట్టం అమల్లోకి వచ్చిందని, 1919లో దీనిని సవరించారని గుర్తుచేశారు. సవరణల ప్రకారం సహకార చట్టమనేది ఐచ్ఛిక అంశంగా మారిందని విశ్వం తెలిపారు. 1936లో వచ్చిన చట్టం ప్రకారం సహకార రంగాన్ని రాష్ట్రాలకు అప్పగించారు. అప్పటి నుంచి అది రాష్ట్ర పరిధిలోనే ఉంది. సమాఖ్య స్ఫూర్తి, సంబంధాలను దెబ్బతీసేలా మోదీ సర్కార్‌ హఠాత్తుగా కొత్త మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య విధానాన్ని దెబ్బతీయడమే అవుతుంది’ అని బినయ్‌ విశ్వం వ్యాఖ్యానించారు. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సహకార రంగం విలసిల్లుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి రంగాలు సహకార ఉద్యమంతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ కారణంతో ఉద్యోగితాశాతం పెరి గిందని అన్నారు. సామాన్యులకు సమష్టిగా బేరసారాలు చేసే అవకాశాలు దక్కాయన్నారు. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామంటున్న మోదీ సర్కార్‌, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని బహిర్గతం చేయలేదని విశ్వం విమర్శించారు. కేంద్ర వ్యవసాయ శాఖలో ఒక భాగంగా సహకార రంగం ఉంది. ఇప్పుడు కొత్త శాఖ ఏర్పాటుతో ఒరిగేదేమీ లేదని విశ్వం తెలిపారు. చట్టంలోని ఒకట్రెండు మార్పులు చేర్పులు మినహా దాని రూపురేఖలు మార్చిన దాఖలాలు లేవని తెలిపారు. నిజంగానే మోదీ ప్రభుత్వానికి సహకార రంగాన్ని పటిష్టపర్చే ఉద్దేశం ఉంటే ముందుగా అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో చర్చించి ఉండాల్సిందని అన్నారు. కేంద్రం అలాంటి ప్రజాస్వామిక విధానాలను పాటించకుండానే కొత్త శాఖ ఏర్పాటును ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటని విశ్వం ప్రశ్నించారు. ‘సహకార్‌ సే సమృద్ధి’ అంటూ ఏడేళ్లుగా చేపడుతున్న పథకాలు, ప్రణాళికలు ఏమయ్యాయని అడిగారు. దీనిని బట్టి కేంద్రం చెబుతున్న దానికి చేస్తున్నదానికి పొంతన లేదనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు. రాష్ట్రాల హక్కులను హరించే బదులు, సంప్రదింపులు జరిపి ఉంటే బాగుండేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సక్రమంగా లేవని బినయ్‌ విశ్వం తన ప్రకటనలో విమర్శించారు. జీఎస్టీ అమలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కారణంగా రాష్ట్రాలన్నీ కేంద్రప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వెంటనే అఖిపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసి, ప్రస్తుత పరిణామాలపై చర్చించాలని బినయ్‌ విశ్వం సూచించారు. అప్పటివరకు కేంద్రరాష్ట్ర సంబంధాలను దెబ్బతీసేలా ఉన్న చట్టాలను అమలు చేయరాదని తేల్చిచెప్పారు. సహకార స్ఫూర్తిని పరిరక్షించే దిశలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని కేంద్రాన్ని బినయ్‌ విశ్వం డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img