Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సెంట్రల్‌ విస్టాలో నిబంధనలు బేఖాతరు

ఇష్టారాజ్యంగా నిర్మాణం ` అధికారుల నిర్లక్ష్యం
టీఎంసీ ఎంపీ జవహర్‌ సిర్కర్‌ విమర్శలు
కేంద్ర గృహ, పర్యావరణ శాఖలకు లేఖలు

న్యూదిల్లీ : కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని రిటైర్డ్‌ ఐపీఎస్‌, టీఎంసీ ఎంపీ జవహర్‌ సిర్కర్‌ వ్యాఖ్యానించారు. పర్యావరణం, భవన నిబంధనలను అపహాస్యం చేస్తోందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు లేఖలు పంపారు. ఫ్లోర్‌ ఏరియా రేషియో (ఎఫ్‌ఏఆర్‌), పర్యావరణ నేపథ్య అనుమతులు బేఖాతరు కావడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని ప్రస్తావించారు. ఇవే అంశాలపై రాజ్యసభలోనూ సంబంధిత మంత్రుల వివరణను కోరారు. ఆయా మంత్రుల రాతపూర్వక సమాధానాలపై తనకు ఉన్న అభ్యంతరాలను లేఖల్లో ప్రస్తావించారు. ఎఫ్‌ఏఆర్‌లో తేడాలున్నాయని విమర్శించారు. దీనిపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కుషాల్‌ కిశోర్‌ స్పందించారు. సిర్కర్‌ ఈనెల 18న గృహ, పట్టణ వ్యవహారాల మంత్రికి లేఖ పంపారు. ఎఫ్‌ఏఆర్‌కు సంబంధించి తేడాలు ఉండటాన్ని నొక్కిచెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన డిజైన్లలో మొత్తం నిర్మాణ ప్రాంతంలో కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ (సీసీఎస్‌) భవనాలకు 300కుపైగా ఎఫ్‌ఏఆర్‌ వర్తిస్తుందని, అది అనుమతి ఉన్నదాని కంటే చాలా ఎక్కువని తెలిపారు. ‘అండర్‌గ్రౌండ్‌ ఆటోమేటిక్‌ పీపుల్‌ మూవ్‌’ గురించి ఈసీ దరఖాస్తులో పేర్కొనగా దానిని ఎఫ్‌ఏఆర్‌ ఆధారంగా గణించలేదన్నారు. ఈ క్రమంలో జరిగిన మార్పులు, చేర్పులను.. ఇతరప్రాజెక్టులపై ప్రభావాన్ని వివరాలించాలని కోరారు. పర్యావరణం, అటవి, వాతావరణంలో మార్పు శాఖకూ సెంట్రల్‌ విస్టాపై ప్రశ్నలు సంధించారు. ప్రాజెక్టులో భాగంగా రాజ్‌పాథ్‌ లాన్లు, రోడ్డు, అక్కడి ప్రభుత్వ భూమి వెంబడి జరిగే ఎవెన్యూ అభివృద్ధి కోసం ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ) నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. దీనికి లేదంటూ సంబంధిత శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే బదులిచ్చారు. మొత్తం 20వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సెంట్రల్‌ విస్టా నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు. పర్యావరణ సుస్థిరత అన్నది సెంట్రల్‌ విస్టా నిర్మాణంలో కీలకమని మరొక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సెంట్రల్‌ విస్టాలో హరిత ప్రాంత విస్తీర్ణం పెరుగుతుందని, పార్కింగ్‌లోనూ పచ్చదనం ఉంటుందని తెలిపారు. అండర్‌గ్రౌండ్‌ మెట్రో కనెక్టివిటీ అన్నది ప్రణాళిక దశలో ఉందన్నారు. ఈ సమాధానాలను పరిగణనలోకి తీసుకున్న సిర్కర్‌, 80 హెక్టార్లలో జరిగే సెంట్రల్‌ విస్టా అవెన్యూ రీడవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని పర్యావరణ మంత్రి యాదవ్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు చర్యలు, నిబంధనలు, నోటిఫికేషన్‌ చట్టాన్ని ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img