Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సోనియాతో లాలు మాటామంతి

మంటలు చల్లార్చే ప్రయత్నం

పాట్నా : బీహారులో కాంగ్రెస్‌తో నెలకొన్న వైరుధ్యాలు తొలగించడానికి ఆర్‌జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్‌ యాదవ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఉప ఎన్నికల వేళ రెండు పార్టీలు ఘర్షణ పడటం మంచిది కాదని భావించిన లాలు…నేరుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడారు. రెండు పార్టీల మధ్య వైరుధ్యాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీని కట్టడి చేయడానికి భావసారూప్యత గల పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సోనియాకు లాలు సలహా ఇచ్చారు. తారాపూర్‌, కుశ్వేశ్వర్‌ అస్థాన్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతూ లాలు కొద్దిసేపు జర్నలిస్టులతో ముచ్చటించారు. ‘నా ఆరోగ్యం గురించి సోనియాగాంధీ అడిగి తెలుసుకున్నారు. నేను క్షేమంగానే ఉన్నానని చెప్పాను’ అని లాలు తెలిపారు. సోనియాతో లాలుకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికారణంగానే బీహారులో ఆర్‌జేడీకాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడ్డాయి. ‘దేశమంతా విస్తరించిన ఓ జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ...బీజేపీ పీచమణచడానికి భావసారూప్యత గల పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటు చేయాలని కోరాను’ అని లాలు చెప్పారు. కాంగ్రెస్‌పార్టీని పక్కన పెట్టి ఆర్‌జేడీ రెండు స్థానాల ఉప ఎన్నికలకు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఆర్‌జేడీ వైఖరిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. బీహారుకు ఏఐసీసీ ఇన్‌చార్జి భక్తచరణ్‌ దాస్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఉప ఎన్నికల్లో రెండు సీట్లలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దించుతున్నట్లు ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40 లోక్‌సభ సీట్లలోనూ పోటీ చేస్తామని స్పష్టంచేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత లాలు తారాపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడుతుంటే ఆయన అభిమానులు పులకించిపోయారు. లాలు సభకు ప్రజలు భారీగా వచ్చారు. రిగ్గింగ్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీకాంగ్రెస్‌ కూటమి ఓటమి చెందిందని లాలు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img