Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సౌభ్రాతృత్వం.. మతసామరస్యానికి ప్రతీక

గుజరాత్‌ ఆలయంలో 100 మంది ముస్లింలకు ఇఫ్తార్‌ విందు
న్యూదిల్లీ : దేశంలో మతవిద్వేషాలు పేట్రేగిపోతున్న వేళ గుజరాత్‌లోని చరిత్రాత్మక ఆలయం సౌభ్రాతృత్వాన్ని చాటింది. రంజాన్‌ ఉపవాసాల నేపథ్యంలో 100 మంది ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. మగ్‌రీబ్‌ (సూర్యాస్తమం సమయంలో చేసే నమాజ్‌) ప్రార్థనలకు సౌకర్యం కల్పించింది. గుజరాత్‌, బనస్కంతా జిల్లాలోని దల్వానా గ్రామంలో 1200 ఏళ్ల నాటి వరండా వీర్‌ మహారాజ్‌ మందిర్‌ ఈనెల 9న తొలిసారిగా ముస్లింలకు ఇఫ్తార్‌, మగ్‌రీబ్‌ నమాజ్‌కు ఆహ్వానించింది. గ్రామానికి చెందిన 100 మంది ముస్లింలకు ఈ ఆహ్వానం అందింది. ఆలయ పురోహితుడు పంకజ్‌ థాకర్‌ (55) మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఎప్పుడూ సోదరులుగా కలిసిమెలిసి ఉన్నారని, హిందువులు, ముస్లింల పండుగులు ఒకేసారి వచ్చినప్పుడు (ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది) పరస్పరం సహకరించుకుంటారని చెప్పారు. ఈ ఏడాది ముస్లింలను ఆలయానికి ఆహ్వానించాలని ఆలయ ట్రస్టు, గ్రామ పంచాయతీ సంయుక్తంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇఫ్తార్‌ కోసం ఐదారు రకాల పండ్లు, షర్బత్‌ (శీతలపానీయం) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను స్వయంగా స్థానిక మసీదు మౌలానా సాహిబ్‌ను ఆహ్వానించినట్లు థాకర్‌ తెలిపారు. గ్రామానికి చెందిన వసీం ఖాన్‌ (35) కూడా థాకర్‌ భావాలనే ప్రతిబింబించారు. గ్రామంలో మతసామరస్యం ఉందన్నారు. హిందువుల పండుగలప్పుడు దల్వానా ముస్లింలు భుజం భుజం కలిపి పనిచేస్లూ వచ్చారని చెప్పారు. ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడం భావోద్వేగ క్షణమని అన్నారు. రామనవమి రోజున దేశంలో మతహింస, అసమ్మతి జ్వాల రగిలింది. ముస్లింలపై హింసకు సంబంధించి అనేక ఘటనలు నమోదయ్యారు. వారి సామాజిక`ఆర్థిక బహిష్కరణకు పిలుపులు వినిపించాయి. ఇలాంటి తరుణంలో గుజరాత్‌ ఆలయం సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. దల్వానా తరహా సంఘటనలు భవిష్యత్‌పై ఆశలను చిగురింపజేస్తున్నాయని వడ్గామ్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాని అన్నారు. ఈనెలారంభంలో కేరళ, మలప్పురం జిల్లా, వాణియన్నూర్‌లోగల ఛత్రాంగదు శ్రీ మహా విష్ణు ఆలయం కూడా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా 200 మంది ముస్లింల (పురుషులు, మహిళలు, పిల్లల) కోసం సామూహిక ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img