Friday, April 19, 2024
Friday, April 19, 2024

స్కూళ్ల కుంభకోణం కేసు : పశ్చిమబెంగాల్‌ మంత్రి అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య పరిణామాలు
పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తోందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు గుప్పిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఏకంగా మంత్రినే అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థ ఛటర్జీని అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా.. పార్థ ఛటర్జీ ఇదివరకు విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. అప్పట్లో ఆయన ఉపాధ్యాయుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సమీప బంధువు అర్పిత ఛటర్జీ నివాసంలో లెక్క తేలని 20 కోట్ల రూపాయల నగదు లభించిన మరుసటి రోజే ఈ అరెస్ట్‌ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెకెండరీ స్కూల్‌ కుంభకోణంలో అర్పిత ఛటర్జీకి పార్థ ఛటర్జీ సహకరించారనడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. రూ. 20 కోట్లు ఇప్పుడు వాటి ఆధారంగానే ఆయనను అరెస్ట్‌ చేశారు. అర్పిత నివాసం, కార్యాలయాలపై ఈడీ అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా 20 కోట్ల రూపాయల నగదు వెలుగులోకి వచ్చింది. ఏకంగా 20 మొబైల్‌ ఫోన్స్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. పార్థ ఛటర్జీతో పాటు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి పరేష్‌ సీ అధికారి, తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసన సభ్యుడు మాణిక్‌ భట్టాచర్య సహా పలువురు నాయకుల నివాసాల్లోనూ ఈడీ అధికారుల సోదాలు నిర్వహించారు.
ఉపాధ్యాయుల నియామకాల్లో చోటు చేసుకున్న ఈ అక్రమాలు, కుంభకోణంపై అటు కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా నిఘా వేసింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను ఈడీ అధికారుల నుంచి తెప్పించుకుంటోంది. కేసు దర్యాప్తుపై దృష్టి సారించింది. ఇవ్వాళో, రేపో సీబీఐ అధికారులు ఈ కేసులో జోక్యం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ, పరేష్‌ సీ అధికారికి నోటీసులను జారీ చేయొచ్చని సమాచారం.
ఈ పరిణామాలు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి రాజకీయంగా ఇబ్బందులను సృష్టించినట్టయ్యాయి. దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురైంది. దీని నుంచి ఆమె ఎలా గట్టెక్కుతారనేది ఆసక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం దర్యాప్తు ఏజెన్సీలను వినియోగించుకుంటోందంటూ మమత బెనర్జీ ఇప్పటికే పలుమార్లు విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img