Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

స్వయం సహాయ సంఘాలకు రూ.వెయ్యి కోట్లు

బాలికల సంరక్షణకు రూ.20 కోట్లు
యూపీలో సంక్షేమ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఎస్పీ పాలనపై విమర్శలు

ప్రయాగ్‌రాజ్‌ (యూపీ) : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌పై దృష్టి పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో మోదీ, మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లో రూ.వెయ్యి కోట్లను స్వయం సహాయక బృందాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీనిద్వారా 16 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. దీనదయాళ్‌ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద ఈ భారీ మొత్తాన్ని విడుదల చేశారు. బాలికల సంరక్షణ కోసం మరో రూ.20 కోట్లపైగా విడుదల చేశారు. ‘ముఖ్యమంత్రి కన్యా సుమంగళ పథకం’ కింద విడుదల చేసిన ఈ మొత్తం ద్వారా లక్షమందికిపైగా లబ్ధి పొందుతారని, లబ్ధిదారులకు రూ.15,000 చొప్పున అందుతుందని యూపీలోని ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే 43 జిల్లాల్లో 202 సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ తయారీ యూనిట్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్లకు స్వయం సహాయక సంఘాలు నిధులు సమకూరుస్తాయి. ఒక్కో యూనిట్‌ను రూ.కోటి వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మథురా ఎంపీ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. ఈ పథకం యూపీ ఆడపడుచులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతలపై పరోక్షంగా విమర్శలతో దాడి చేశారు. మహిళల వివాహ వయసును 21కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలు సంతోషం కలిగించగా, కొందరికి బాధపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇచ్చిన 30 లక్షల ఇళ్లలో 25 లక్షలు మహిళల పేరు మీద నమోదయ్యాయన్నారు. మహిళా సాధికారత పై ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని మోదీ అన్నారు. ‘మహిళల వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. తద్వారా వారు చదువుకొని అభివృద్ధి చెందడానికి సమయం ఉంటుంది. దేశం తన కుమార్తెల కోసం ఈ నిర్ణయం తీసుకుంటోంది. దీంతో ఎవరు ఇబ్బందులు పడుతున్నారో అందరూ చూస్తున్నారు. కొందరికి బాధ కలిగించింది’ అని ప్రధాని తెలిపారు. ఈ అంశంపై ఇటీవల ఎస్పీ ఎంపీలు కొందరు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎస్పీ పాలనపై ప్రధాని మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ రోడ్లపై మాఫియా విధ్వంసం సృష్టించిందని, దీనివల్ల మన సోదరీమణులు, కుమార్తెలు ఘోరంగా బాధపడ్డారన్నారు. వారు రోడ్లపైకి వెళ్లడం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం చాలా కష్టమైన సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ పోకిరీలను వారిని ఎక్కడ ఉంచాలో ఆ స్థానంలో ఉంచారని ప్రధాని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు భద్రత, హక్కులు, అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img