Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హమీద్‌ అన్సారీపై కేంద్రం ఆగ్రహం


న్యూదిల్లీ / భోపాల్‌: ‘దృఢమైన, విస్తారమైన భారత ప్రజాస్వామ్యానికి ఇతరుల ధ్రువపత్రాలు అక్కర్లేదు’ అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం స్పష్టం చేసింది. హిందూ జాతీయవాదం ప్రబలుతున్న భారతదేశంలో అసహనం, అభద్రత పెరుగుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, అమెరికా చట్టసభల ప్రతినిధులు కొందరు వ్యక్తం చేసిన ఆందోళనకు కేంద్ర మంత్రిత్వశాఖ దీటుగా స్పందించింది. ‘ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌’ గత బుధవారం వర్చువల్‌గా ఏర్పాటుచేసిన సదస్సులో హమీద్‌ అన్సారీ తదితరులు పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి మాట్లాడుతూ.. ‘ఆ సదస్సు వివరాలు తెలుసుకున్నాం. వక్తల పక్షపాత ధోరణి, రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉన్నాయి. మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఇతరులు గళమెత్తడం అసంబద్ధం.. విపరీత ధోరణి’ అన్నారు. ‘హమీద్‌ అన్సారీ అభిప్రాయం తప్పు. మైనార్టీలకు ఇంతకంటే సురక్షితమైన దేశం లేదు. ఇరుగు పొరుగు దేశాల మైనార్టీలు కూడా రక్షణ కోరి భారత్‌లోకి వస్తున్నారు’ అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు. ‘కొంతమంది వ్యక్తులు, సంస్థలు భారత వ్యతిరేక ప్రచారానికి ‘సుపారీ’ తీసుకొన్నట్లుగా ఉందని దేశం భావిస్తోంది’ అని మరో కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘హమీద్‌ అన్సారీ తుక్డే తుక్డే గ్యాంగ్‌ మద్దతుదారులా మాట్లాడుతున్నారు’ అంటూ మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్ర భోపాల్‌లో మీడియా ఎదుట ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img