Friday, April 19, 2024
Friday, April 19, 2024

16న సీడబ్ల్యూసీ భేటీ

న్యూదిల్లీ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ఈనెల 16న సమావేశమవుతుంది. లఖింపూర్‌ హింసతో పాటు దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొన్ని రాష్ట్రాలకు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పెద్దలు చర్చిస్తారు. వీటితోపాటు కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలపై సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల కాలంలో పెద్దఎత్తున పార్టీ ఫిరాయింపులు జరగడంతో పాటు అనేక కీలక అంశాలపై చర్చించడానికి వర్కింగ్‌ కమిటీని సమావేశపర్చాలని పార్టీలోని కొంతమంది నాయకులు డిమాండు చేస్తున్నారు. వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ సైతం పార్టీ చీఫ్‌ సోనియాగాంధీకి లేఖ రాశారు. అక్టోబరు 16వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమావేశం చర్చిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. కరోనా కారణంగా సీడబ్ల్యూసీ సమావేశం ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిరది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ ఘటన తమకు కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. బీజేపీని ఇరుకున పెట్టడానికి, రాజకీయంగా లబ్ధిపొందడానికి ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడుతుంది. పార్టీలో తిరుగుబాట్లు, అసమ్మతి వంటి అంశాలపై సమావేశం చర్చిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img