Friday, April 19, 2024
Friday, April 19, 2024

200 మంది ఉగ్రవాదులతో ముప్పు

వారు జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధం
ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది

ఉదంపూర్‌ : దేశంలోకి చొరబాట్లు బాగా తగ్గినప్పటికీ, ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు సరిహద్దు వెంబడి సిద్ధంగా ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 2021 ఒప్పందం నాటి నుంచి భారతపాక్‌ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ బాగా పని చేస్తోందని అన్నారు. స్థానిక ఆశ్రయం, మద్దతు లేకపోవడంతో ఇప్పటి వరకు ఈ సంవత్సరం 21 మంది విదేశీ ఉగ్రవాదులను అంతమొందించినట్లు చెప్పారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల సంఖ్య తగ్గిందని అన్నారు. ‘భారతపాక్‌ సరిహద్దు వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు ఉన్నారు. వారు జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు వాస్తవధీన రేఖ (ఎల్‌వోసీ) వెంబడి వేచి ఉన్నారు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ద్వివేది తెలిపారు. చొరబాట్లను అడ్డుకునేందుకు రెండవ శ్రేణి రక్షణ దళాలను మోహరించామని అన్నారు. గత సంవత్సర కాలంలో కాల్పుల విరమణ ఉల్లంఘనల సంఖ్య చాలా పరిమితంగా ఉందని తెలిపారు. సరిహద్దు వెంబడి ఆరు పెద్ద ఉగ్రవాద శిబిరాలు, 29 చిన్న శిబిరాలు ఉన్నాయి. అలాగే వేర్వేరు సైనిక సదుపాయాలకు సమీపంలో తాత్కాలిక లాంచింగ్‌ పాడ్‌లు ఉన్నాయని వివరించారు. వీటి విషయంలో పాకిస్థాన్‌ సైన్యం, దాని సంస్థల భాగస్వామ్యాన్ని తిరస్కరించలేమని తెలిపారు. చొరబాట్లు కేవలం పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాల మీదుగానే జరగదని, జమ్ముకశ్మీర్‌ అంతర్జాతీయ సరిహద్దు, పంజాబ్‌, నేపాల్‌ మీదుగా కూడా జరుగుతుందని ఆయన అన్నారు. ‘ఈ వ్యక్తులను గుర్తించడం, వీలైనంత త్వరగా వారిని నిర్మూలించడమే మా లక్ష్యం’ అని పేర్కొంటూ, విదేశీ ఉగ్రవాదులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుతం 40 నుంచి 50 మంది స్థానిక ఉగ్రవాదులు పనిచేస్తున్నారని, వారి సంఖ్యను గుర్తించలేదని లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేది తెలిపారు. ఉగ్రవాదంలోకి యువత ఎక్కువగా నియమితులవుతున్నారని, ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. సరిహద్దుల వెంబడి, లోతట్టు ప్రాంతాలలో క్రియాశీల కార్యాచరణ పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కోవడానికి, విజేతలుగా రావడానికి జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లోని సైనికులు కఠినమైన యుద్ధానికి సన్నద్ధం కావాలని లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేది తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img