Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

29 నుంచి పార్లమెంటు సమావేశాలు

న్యూదిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసినట్లు సోమవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. గత ఒకటిన్నరేళ్లలో జరిగినట్లుగానే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కోవిడ్‌-19 ప్రోటోకాల్స్‌కు కట్టుబడి దాదాపు 20 రోజులు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. అలాగే బడ్జెట్‌, వర్షాకాల సమావేశాలను కుదించాల్సి వచ్చింది. ఎంపీలతో సహా పార్లమెంటుకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కోవిడ్‌-19 పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ సెషన్‌కు ప్రాధాన్యత ఉంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, వంటనూనెల ధర పెరుగుదల, కశ్మీర్‌లో పౌరులపై ఉగ్ర దాడులు, లఖింపూర్‌ ఖేరీ రైతుల మృతి, మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు వంటి అంశాలు కీలకం కానున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వీటిని లేవనెత్తే అవకాశం ఉంది. ఈ ఏడాది పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయాలన్న ప్రతిపక్షాల నిరసనలతో అట్టుడికిన సంగతి విదితమే. నిరసనల కారణంగా షెడ్యూల్‌ కన్నా రెండు రోజుల ముందుగానే సమావేశాలు వాయిదాపడ్డాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img