Friday, March 31, 2023
Friday, March 31, 2023

300 మంది అభ్యర్థులు ఖరారు : బీఎస్పీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు గాను బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) 300 మంది అభ్యర్థుల (మొత్తం 403 సీట్లు) ను ఖరారు చేసింది. వీరిలో 90 మంది దళితులేనని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ మిశ్రా గురువారం తెలిపారు. ‘ఇప్పటి వరకు ఖరారు చేసిన 300 పేర్లలో 90 మంది దళితులు… మిగిలిన స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించిన తర్వాత వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది’ అని మిశ్రా స్పష్టం చేశారు. బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థుల గురించి ప్రశ్నించగా ‘జనవరి 15న మాయావతి పుట్టినరోజు తర్వాత అధికారికంగా జాబితాను ప్రకటిస్తే మీకు తెలుస్తుంది’ అని బదులిచ్చారు. అభ్యర్థుల ఎంపికలో బ్రాహ్మణులు, ముస్లింలకు మంచి ప్రాతినిథ్యం కల్పించామని మరో పార్టీ నేత అన్నారు. తాజా ఎన్నికలలో దళితులు, బ్రాహ్మణులను కలుపుకొని 2007 నాటి విజయ సూత్రంతో ముందుకు వెళ్లాలని బీఎస్పీ కోరుకుంటున్నట్లు మాయావతి ఇప్పటికే ప్రకటించారు. ముస్లిం సమాజంలో కూడా ఈ పార్టీకి గణనీయ సంఖ్య ఓట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ జనాభాలో దళితులు 20 శాతానికి పైగా ఉండగా, బ్రాహ్మణులు 13 శాతం, ముస్లింలు దాదాపు 20 శాతం ఉన్నారు. ‘ఇతర పార్టీలు తమ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌లను (ఫిబ్రవరి 10న మొదటి దశ ఎన్నికలకు అభ్యర్థులు) ఇంకా నిర్ణయించుకోనప్పటికీ బీఎస్పీ 300 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. కొందరి పేర్లు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది’ అని మిశ్రా చెప్పారు. ఎన్నికల సన్నద్ధత గురించి మాట్లాడుతూ… రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో దాదాపు 96 ర్యాలీల్లో తానొక్కడినే ప్రసంగించానని చెప్పారు. పార్టీకి పటిష్టమైన వేదికను సిద్ధం చేసేందుకు పార్టీలోని ఇతర నేతలు కూడా అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడయిన మిశ్రా బీఎస్పీలో బ్రాహ్మణ వర్గానికి చెందిన నేత, దళితులు` బ్రాహ్మణుల మధ్య సన్నిహిత బంధాన్ని ఏర్పరచడానికి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. 2007లో యూపీలో అధికారంలోకొచ్చిన బీఎస్పీ ఇదే సూత్రాన్ని పాటించి విజయం సాధించింది. పార్టీ అధినేత్రి మాయావతి, ఇతర పార్టీ నాయకులు ఏడాది కాలంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నారని, స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించిన తర్వాతనే అభ్యర్థులను నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img