Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

33 ఏళ్ల తర్వాత ఎన్నికల బరిలో ‘రాజా ఆఫ్‌ అమేథీ’

కాషాయ పార్టీ నుండి యూపీ ఎన్నికల్లో సంజయ్‌ సింగ్‌
అమేథి : ఎన్నికల పోరులో ఓడిపోయిన 33 ఏళ్ల తర్వాత ‘రాజా ఆఫ్‌ అమేథీ’ మరోసారి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలోకి దిగారు. పూర్వం ‘రాజా ఆఫ్‌ అమేథీ’ అయిన 70 ఏళ్ల సంజయ్‌ సింగ్‌ అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన 33 ఏళ్ల తర్వాత తొలిసారి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అమేథీ అంతా చూసింది. రాజకీయాల పట్ల మక్కువ ఉన్న పూర్వపు రాజవంశం. కుతంత్రాలు, ‘రాణుల’ వ్యూహాలు చూసిన రాజభవనం. ఏడు దశల్లో ఐదో విడతలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానం నుంచి 2019లో కాంగ్రెస్‌ పార్టీ నుండి కాషాయ శిబిరానికి చేరిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దించగా, కాంగ్రెస్‌ పార్టీ ఆశిష్‌ శుక్లా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బహుజన్‌ సమాజ్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శుక్లా, 2017లో బీజేపీకి మారారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాగా సంజయ్‌ సింగ్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కొద్ది క్షణాల తర్వాత శుక్లాను దిల్లీలో కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఇందిరా గాంధీ కాలం నుండి గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్న అమేథీ నియోజకవర్గం నుండి వెంటనే అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారు. ఈ క్రమంలో సింగ్‌, శుక్లా తమ తమ కొత్త పార్టీలకు తమ విధేయతను చాటుకున్నారు. వారి పార్టీల మేనిఫెస్టోలతో ఓటర్లకు చేరువవుతున్నారు. అయితే, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోరులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జీవిత ఖైదీగా ఉన్న గాయత్రి ప్రజాపతి భార్యను అసెంబ్లీ స్థానానికి పోటీకి దింపింది. గాయత్రి ప్రజాపతి అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అతను గత ఐదేళ్లుగా అనేక అవినీతి, నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక బీఎస్‌పీ తన వంతుగా, రాగిణి తివారీని ఎంచుకుంది. అమేథీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3.48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 80 వేల మంది బ్రాహ్మణులు, దాదాపు 30 వేల మంది ఠాకూర్లు, 25 వేల మంది ముస్లింలు, దళితులు 30 వేల మంది, దాదాపు 1.25 లక్షల మంది ఇతర వెనుకబడిన తరగతుల ఓటర్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img