Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మణిపూర్‌లో 40 మంది తిరుగుబాటుదారుల హతం..

తిరుగుబాటుదారులపై మణిపూర్‌లోని బీరేన్‌సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భద్రతా దళాలు 40 మందిని హతమార్చినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నిన్న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ ప్రాంతాల్లో సైన్యం కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో తిరుగుబాటుదారులు కాల్పులకు తెగబడ్డారు. రోజంతా కాల్పులు జరిగాయి. తిరుగుబాటుదారుల మృతదేహాలు పదుల సంఖ్యలో వీధుల్లో చెల్లాచెదురుగా పడి కనిపించాయి. ఘర్షణలకు పాల్పడిందీ, కాల్పులకు తెగబడిందీ కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్నారు. ఉగ్రవాదులు ఏకే 47, ఎం 16, స్పైపర్ తుపాకులతో ప్రజలపై దాడులకు దిగుతున్నారని, ఊర్లోకి చొరబడి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని సీఎం తెలిపారు. ఇది జాతుల మధ్య ఘర్షణ కాదన్న సీఎం.. ఉగ్రవాదులు-భద్రతా దళాలపై జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన 12 మందికి ఇంఫాల్ రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇరు వర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు కూడా మరణించారు. కల్లోలిత మణిపూర్‌లో నేడు కేంద్రహోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మూడు రోజులపాటు పర్యటించున్న ఆయన ఆయా వర్గాలతో సమావేశమవుతారు. కాగా, ఈ నెల 3 నుంచి మణిపూర్‌లో అశాంతి నెలకొంది. అక్కడి గిరిజనులు ఎస్టీ హోదా డిమాండ్ చేయడంపై నెలకొన్న వివాదం హింసకు దారితీసింది. ఇది మెయిటీ-కుకీ తెగల మధ్య ఘర్షణలకు కారణమైంది. ఈ నెల 3న మొదలైన ఈ ఘర్షణలతో రాష్ట్రం అట్టుడికింది. అప్పటి నుంచి మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img