దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. అసలే ఇరుకైన రహదారులు.. ఆపై వాహనాల రద్దీని దాటుకొని, గమ్యస్థానాలకు చేరడానికి కొన్ని గంటలు పడుతుంది. ఇక, చినుకుపడితే బెంగళూరు నగరవాసులకు నరకమే. ట్రాఫిక్ అంతరాయం, వాహనాల రద్దీ, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం వంటి వాటి కారణంగా సమయం, ఇంధనం వృథా అయి బెంగళూరు నగరానికి ఏటా దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి, ఆయన బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. రహదారి ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, మౌలిక సదుపాయాల లోటు వంటి అంశాలను ఈ బృందం పరిశీలించి.. నివేదికను రూపొందించింది. నగరంలో పూర్తిస్థాయిలో పనిచేసే దాదాపు 60 ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ.. బెంగళూరు నగరం ఏటా రూ.19,725 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తోందని అధ్యయన నివేదిక పేర్కొంది. ఐటీ వృద్ధితో నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం వల్ల నివాసం, విద్య వంటి ఇతర సౌకర్యాలు మెరుగవుతున్నాయని సర్వే తెలిపింది. పెరిగిన 14.5 మిలియన్ల భారీ జనాభాకు అనుగుణంగా.. వాహనాల సంఖ్య 1.5 కోట్లకు చేరువలో ఉంది.అయితే, దానికి తగ్గట్టుగా రహదారుల విస్తరణ లేదని ఆ బృందం నొక్కిచెప్పింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటూ వేగంగా పెరుగుతోన్న జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన సరిపోవడం లేదని, ఆ వ్యత్యాసమే ఈ ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోందని పేర్కొంది. అంచనాల ప్రకారం 2023 నాటికి బెంగళూరు 88 చదరపు కిలోమీటర్ల నుంచి 985 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది. ఈ అధ్యయనం నగరాన్ని 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని ప్రతిపాదించింది.