ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదివరకే సొంత పార్టీని ప్రకటించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై అప్పటివరకు వచ్చిన గాసిప్స్ అన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. విజయ్ పెట్టే పార్టీ ఎలా ఉండొచ్చు? దాని పేరేంటీ?..అనే ప్రశ్నలకు తెరపడిందప్పట్లో. తమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రం చేశారు. తాను నెలకొల్పిన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం నామకరణం చేసినట్లు తెలిపారు. సౌతిండియన్ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులు ఉన్న రజినీకాంత్ చేయలేని పనిని విజయ్ సాధించినట్టయింది. సినిమా నటులు వెండితెర మీది నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. తమిళనాడులో కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యదైవాలుగా నిలిచిన ఎం జీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత.. ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ సినిమాలే. బహుభాషా నటుడు కమల్ హాసన్.. మక్కళ్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వయానా కమల్ హాసన్ సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తాజాగా- తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా, ఎన్నికల గుర్తును విజయ్ ఆవిష్కరించనున్నారు. చెన్నై పనైయ్యూర్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చెన్నైలో చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రెండురోజులుగా విజయ్ స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.