ఒలింపిక్స్ లో అనర్హతకు గురైన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కు స్వర్ణ పతకం లభించింది. అయితే, ఈ పతకం ఒలింపిక్స్ నిర్వాహకులు ఇచ్చింది కాదు. వినేశ్ స్వగ్రామం బలాలి ప్రజలు అభిమానంతో చేయించి ఇచ్చిన పతకం. వినేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం బలాలిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామస్తులు ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. బంగారు పతకం మెడలో వేయడంతో పాటు కరెన్సీ నోట్ల దండలతో సత్కరించారు. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ పై వేటు పడింది. 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్ లో గెలిచినప్పటికీ రెజ్లర్ కు పతకం దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన వినేశ్ కు ఆమె సొంత గ్రామం నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఒలింపిక్స్ కమిటీ వేటు వేసినప్పటికీ తమ దృష్టిలో వినేశ్ స్వర్ణం గెలిచినట్లేనని గ్రామస్తులు చెప్పారు. తామే బంగారు పతకం చేయించి ఆమె మెడలో వేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే తాజాగా వినేశ్ ఫోగాట్ పుట్టిన రోజు వేడుకల్లో గోల్డ్ మెడల్ తో సన్మానించారు.
పోరాటం ఇప్పుడే మొదలైంది.. వినేశ్
నా పోరాటం ముగియలేదు.. మన దేశంలోని అమ్మాయిల కోసం ఇప్పుడే మొదలైంది. ఒలింపిక్స్ లో ఫైనల్ కు దూరమవడంతో ఎంతో బాధ పడ్డా. అయితే, తిరిగి వచ్చాక నాకు దక్కిన మద్దతు చూశాక నేను ఎంతో అదృష్టవంతురాలినని అనిపించింది. ఇప్పుడు అందుకున్న ఈ మెడల్ కంటే నాకు ఏదీ గొప్పది కాదు్ణ అని బలాలిలో జరిగిన సన్మాన సభలో వినేశ్ ఫోగాట్ వ్యాఖ్యానించారు.