Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయ చిహ్నంలో గర్జించే సింహాలా…!

అవమానం జరిగింది… తక్షణమే మార్చండి
విపక్ష సభ్యులు, కార్యకర్తల అభ్యంతరం

న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని వక్రీకరించిందని విపక్ష సభ్యులు, కార్యకర్తలు మంగళవారం విమర్శించారు. అద్భుతమైన హుందాతనం నిండిన అశోకుని సింహాలతో కూడిన మన జాతీయ చిహ్నానికి అవమానం జరిగిందన్నారు. అసలు చిహ్నంలోని సింహాలు ఎంతో నాజూకుగా, రాజసంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ఉంటాయని తెలిపారు. అయితే ఇవి గర్జిస్తున్నట్లు, అనవసరమైన దూకుడును ప్రదర్శిస్తూ పొంతన లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. వాటిని తక్షణమే వీటిని మార్చాలని డిమాండ్‌ చేశారు. ‘నరేంద్ర మోదీ జీ, దయచేసి సింహం ముఖాన్ని గమనించండి. అది గ్రేట్‌ సారనాథ్‌ విగ్రహాన్ని సూచిస్తుందా లేదా జీఐఆర్‌ సింహం వక్రీకరించిన రూపాన్ని సూచిస్తుందా…? దయచేసి దాన్ని తనిఖీ చేయండి. అవసరమైతే, అదే సరిదిద్దండి’ అని లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కొత్త పార్లమెంట్‌ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ప్రతిపక్ష నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. మోదీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించాయి. టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ ఇచ్చిన ట్వీట్‌లో, అద్భుతమైన హుందాతనం నిండిన అశోకుని సింహాలతో కూడిన మన జాతీయ చిహ్నానికి అవమానం జరిగిందన్నారు. అసలు చిహ్నంలోని సింహాలు ఎంతో నాజూకుగా, రాజసంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ఉంటాయన్నారు. నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని సింహాలు మోదీ తరహాలో ఉన్నాయన్నారు. ఇవి కోపంతో గుర్రు పెడుతున్నట్లు, అనవసరమైన దూకుడును ప్రదర్శిస్తూ, పొంతన లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. ఇది సిగ్గుచేటు అని, తక్షణమే వీటిని మార్చాలని డిమాండ్‌ చేశారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర ఇచ్చిన ట్వీట్‌లో పాత, కొత్త జాతీయ చిహ్నాలను పోస్ట్‌ చేశారు. అయితే ఆమె తన వ్యాఖ్యను జోడిరచలేదు. కొత్త జాతీయ చిహ్నంపై చరిత్రకారుడు ఎస్‌.ఇర్ఫాన్‌ హబీబ్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మన జాతీయ చిహ్నం విషయంలో జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరం. మన సింహాలు క్రూరంగా, ఆత్రుతతో ఎందుకు కనిపించాలి?. ఇవి 1950లో స్వతంత్ర భారతదేశం స్వీకరించిన అశోకుని సింహాలు’ అని హబీబ్‌ అన్నారు. సీనియర్‌ న్యాయవాది, కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ మాట్లాడుతూ ‘గాంధీ నుంచి గాడ్సే వరకు, గంభీరంగా, శాంతియుతంగా కూర్చున్న సింహాలతో మన జాతీయ చిహ్నం నుంచి, సెంట్రల్‌ విస్టాలో నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంట్‌ భవనం పై భాగానికి ఆవిష్కరించిన కొత్త జాతీయ చిహ్నానికి, కోరలు లేని కోపంతో ఉన్న సింహాలు. ఇది మోదీ కొత్త భారతదేశం’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img