సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని.. కేవలం దానిని వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ఉదయనిధి స్పందించారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎటువంటి కేసులను ఎదుర్కోడానికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ.. నాపై ఎటువంటి కేసులను పెట్టిన ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాను.. ప్రతిపక్ష కూటమి ఇండియాను చూసి బీజేపీ భయపడుతోంది.. సమస్యలపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికే రాద్దాంతం చేస్తున్నారు.. దేవుడు ఒక్కడనేది డీఎంకే విధానం.. తాను కేవలం సనాతన ధర్మాన్ని విమర్శించాను.. నా వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది్ణ అని అన్నారు. నేను సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించాను.. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని మళ్లీ చెబుతున్నాను. పదే పదే ఇదే చెబుతాను. నేను మారణహోమానికి ఆజ్యం పోశానని చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు.. మరికొందరు ద్రవిడాన్ని రద్దు చేయాలని అంటున్నారు. అంటే డీఎంకే వాళ్లను చంపాలా? అని ఉదయనిధి ప్రశ్నించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాని మోదీ చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్లను చంపాలా? సనాతన అంటే ఏమిటి? సనాతన అంటే ఏదీ మారకూడదు.. అన్నీ శాశ్వతం. కానీ ద్రవిడ మోడల్ మార్పు కోసం పిలుపునిస్తుంది.. అందరూ సమానంగా ఉండాలి. నా ప్రకటనను వక్రీకరించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం బీజేపీకి మామూలే్ణ అని ధ్వజమెత్తారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌లు విరుచుకుపడ్డారు. విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని, వచ్చే ఎన్నికల్లో హిందూ వ్యతిరేక వ్యూహాన్ని ఇండియా అనుసరించబోతుందా? అని ఉదయనిధి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జేపీ నడ్డా పరోక్షంగా దాడి చేశారు. గత రెండు రోజులుగా ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానిస్తోంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని మాట్లాడుతున్నారు. మన సనాతన ధర్మాన్ని అవమానించడం ఇదే మొదటిసారి కాదు అని అమిత్ షా మండిపడ్డారు.
మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. తమిళనాడులో కొంత మంది నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోందని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన కాశీ, తమిళ సంగమం కార్యక్రమాన్ని తమిళనాడులోని ప్రతి గ్రామం ఆదరించిందని ఆయన తెలిపారు. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ఇలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యల వల్ల దానికి ఏమీ నష్టం జరగదని అన్నారు