Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

భారత యువత వైపు ప్రపంచం చూపు

ప్రధాని నరేంద్ర మోదీ

చెన్నై: యువతపై ఆశతో ఎదురుచూసేది భారతదేశం ఒక్కటే కాదు… ప్రపంచ మొత్తం భారతదేశ యువత వైపు ఆశగా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం గిండీలో జరిగిన 47వ అన్నా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని, ఇటీవల విశ్వావిద్యాలయం నుంచి పట్టభద్రులైన 70 మంది విద్యార్థులకు పతకాలను అందజేశారు. స్నాతకోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ… ‘ఈ రోజు సాధించే రోజు కాదు, ఆకాంక్షల రోజు… మన యువత అన్ని కలలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఇది బోధన, బోధనేతర, సహాయక సిబ్బంది, అన్నా విశ్వవిద్యాలయానికి కూడా కీలక సమయం. రేపటి నాయకులను సృష్టించే దేశ నిర్మాతలు మీరే’ అంటూ కొనియాడారు.
‘భారతదేశం మాత్రమే కాదు… యావత్‌ ప్రపంచం భారత యువత వైపు ఆశగా చూస్తోంది… మీరు భారతదేశ వృద్ధికి ఇంజన్‌. భారతదేశం ప్రపంచ వృద్ధికి ఇంజన్‌’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుత సమయాన్ని కొందరు ప్రపంచ అనిశ్చితి సమయం అని పిలుస్తారేమో కానీ నేను దానిని గొప్ప అవకాశాల సమయం అని పిలుస్తాను. విద్యార్థులు ఒక ప్రత్యేకమైన సమయంలో గ్రాడ్యుయేట్‌ చేస్తున్నారని చెప్పారు. కోవిడ్‌-19 మహమ్మారి ఒక ప్రత్యేకమైన సంఘటన అని, ఇది ప్రతి దేశాన్ని పరీక్షించిందని చెప్పారు. దీనిపై భారతదేశ పోరాటంలో శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ప్రజల కృషి గణనీయమైనదన్నారు. భారతదేశం అడ్డంకులను అవకాశాలుగా మలుచుకుంటోందని ప్రధాని చెప్పారు. పరిశ్రమలు కొత్త ఆలోచనలతో దూసుకుపోతున్నాయన్నారు. బలమైన ప్రభుత్వం అంటే ప్రతి దానినీ లేదా ప్రతి ఒక్కరినీ నియంత్రించాలన్న భావనను పాలక ఎన్డీయే మార్చేసిందని మోదీ చెప్పారు. దేశంలో అనేక రంగాల్లో సంస్కరణలను సమర్థించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కొత్త మార్గాలను తెరిచిందని, అవసరమైన మౌలిక వసతుల మద్దతును అందించిందని చెప్పుకున్నారు. అవకాశాలు సృష్టించబడతాయని, నిలకడగా వృద్ధి చెందుతాయని ప్రధాని చెప్పుకొచ్చారు. తమిళనాడులో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్‌ఈపీ యువతకు ఎక్కువ స్వేచ్ఛను అందిస్తుందన్నారు. పట్టభద్రులైన విద్యార్థులందరినీ ప్రధాని అభినందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ… ‘విద్య అనేది ఎవ్వరూ దోచుకోలేని ఆస్తి. అందుకే విద్యపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని భావిస్తున్నాం. ద్రావిడ నమూనా కూడా అందరికీ విద్యాబోధన చేసే దిశగా పనిచేస్తుంది. సామాజిక న్యాయం కూడా దీని ఆధారంగానే ఉంది. అందరికీ విద్య, అందరికీ ఉద్యోగాలు, అందరికీ అన్నీ అందాలి’ అని అన్నారు. స్టాలిన్‌ తన ప్రభుత్వం విద్య కోసం ప్రవేశపెట్టిన కొన్ని పథకాల గురించి కూడా మాట్లాడారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి మాట్లాడుతూ… గ్రాడ్యుయేట్‌లకు ఉపాధి కల్పించడమే కాకుండా వారిలో అనేక మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం స్టాలిన్‌ ఉద్దేశమని అన్నారు. దీనిలో భాగంగా ఉన్నత విద్యాశాఖ, పారిశ్రామిక శాఖలను ఏకతాటిపైకి తెచ్చి తమ పరిధిలోకి తెచ్చామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img