Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

అవసరమైన శిక్షణ అందిస్తాం

మణిపూర్‌ క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం హామీ

చెన్నై: జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఈ ఘర్షణల్లో అనేక చోట్ల అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది. మణిపూర్‌ క్రీడాకారులకు కావాల్సిన శిక్షణను అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ‘‘ఖేలో ఇండియా, ఆసియా క్రీడలకు అవసరమైన శిక్షణ పొందేందుకు మణిపూర్‌ క్రీడాకారులకు ఆ రాష్ట్రంలో అనుకూలమైన పరిస్థితులు లేవు. అందుకే వారిని మా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పర్యవేక్షణలో మణిపూర్‌ క్రీడాకారులకు అవసరమైన శిక్షణ అందిస్తాం’’ అని ఒక ప్రకటనలో స్టాలిన్‌ తెలిపారు. మణిపూర్‌ క్రీడాకారులకు అత్యున్నత స్థాయి నాణ్యత కలిగిన శిక్షణను అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చెప్పారు. ‘‘ఛాంపియన్లను తయారుచేయడంలో మణిపూర్‌కు ఎంతో పేరుంది. ముఖ్యంగా మహిళా ఛాంపియన్లను తయారు చేయడంలో ఆ రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది’’ అని ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img